Wanderers January 06: సఫారీల గడ్డ మీద చరిత్ర సృష్టించాలనుకున్న టీమిండియా(Team India) ఆశలు అడిఆశలయ్యాయి. సౌతాఫ్రికా(South Africa)తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పరాజయం(South Africa beat India ) పాలయ్యింది. 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. టీమిండియా, ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య జ‌రిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌(2nd Test)కు వ‌రుణుడు బాగా అడ్డంకిగా మారాడు. వ‌రుణుడి ప్ర‌తాపం వ‌ల్ల నాలుగో రోజు సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్‌కు ఆల‌స్య‌మైంది. అయిన‌ప్ప‌టికీ.. త‌మ ముందు ఉన్న 240 ప‌రుగుల ల‌క్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా సుల‌భంగా ఛేదించింది. మొద‌టి టెస్ట్ మ్యాచ్‌లో భార‌త్ గెల‌వ‌డంతో ప్ర‌స్తుతానికి సిరీస్ స‌మంగా ఉంది.

రెండో టెస్ట్‌లో ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్.. 202 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఆ త‌ర్వాత సౌత్ ఆఫ్రికా ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో 229 ప‌రుగులు సాధించి.. 27 ప‌రుగులు ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌.. 266 ప‌రుగులే సాధించి.. సౌత్ ఆఫ్రికాకు 240 ప‌రుగుల టార్గెట్‌ను విధించింది. 240 ప‌రుగుల టార్గెట్‌ను కేవ‌లం 3 వికెట్లు న‌ష్ట‌పోయి సౌత్ ఆఫ్రికా సుల‌భంగా ఛేదించింది. సౌత్ ఆఫ్రికాను 96 ప‌రుగులు చేసి ఎల్గ‌ర్ ఆదుకున్నాడు. డెస్సెన్ 40, మార్క్‌ర‌మ్ 31, పీటర్స‌న్ 28, బ‌వుమా 23 ప‌రుగులు చేశారు. ఇక‌.. ఇండియా, దక్షిణాఫ్రికా మ‌ధ్య మూడో టెస్ట్ జ‌న‌వ‌రి 11న ప్రారంభం కానుంది.