టీమిండియా సెమీఫైనల్ ఆశలు గల్లంతు అయ్యాయి. ఆఫ్ఘనిస్థాన్ పై న్యూజిలాండ్ విజయం సాధించడంతో భారత అభిమానుల ఆశలపై నీళ్లు జల్లినట్లు అయ్యింది. అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో కివీస్ నేరుగా సెమీస్ లోకి అడుగు పెట్టింది. ఆఫ్ఘనిస్థాన్ నిర్దేశించిన 125 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 11 బంతులు మిగిలి ఉండానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. నజీబుల్లా 73, గుల్బాదిన్ 15, కెప్టెన్ నబీ 14 పరుగులు చేశారు. అనంతరం 125 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్.. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 40 (నాటౌట్), డెవోన్ కాన్వే 36 (నాటౌట్), మార్టిన్ గప్టిల్ 28 పరుగులతో రాణించడంతో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో గ్రూప్-2లో న్యూజిలాండ్ 8 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుని నేరుగా సెమీస్‌లోకి ప్రవేశించింది.
మరోవైపు, ఇదే గ్రూపులో ఉన్న పాకిస్థాన్ ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ గెలిచి ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ నేపథ్యంలో రేపటి (సోమవారం) భారత్-నమీబియా మ్యాచ్ నామమాత్రం కానుంది. నేటి మ్యాచ్‌లో కనుక ఆఫ్ఘనిస్థాన్ గెలిచి ఉంటే భారత సెమీస్ అవకాశం ఉండేది. కానీ విలియమ్సన్ సేన ఆల్‌రౌండర్ ప్రతిభతో అదరగొట్టడంతో కోహ్లీ సేన ఆశలు అడుగంటిపోయాయి.