India Team

టీ20 ప్రపంచకప్‌-2022(సూపర్‌-12)లో భాగంగా కీలక మ్యాచ్‌లో ఆడిలైడ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తమ సెమీస్‌ అవకాశాలను మరింత పదిలం చేసుకుంటే.. ఓడిన జట్టు సెమీస్‌ ఛాన్స్‌లను సంక్లిష్టం చేసుకుంటుంది.దక్షిణాఫ్రికా చేతిలో ఓడి కష్టాలు కొనితెచ్చుకున్న టీమిండియా నేడు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది.

సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో దారుణమైన బ్యాటింగ్‌తోపాటు ఫీల్డింగ్ తప్పిదాలు జట్టు ఓటమికి దారితీశాయి. మరోపక్క, తనదైన రోజున పెద్ద జట్లను కూడా కంగుతినిపించే బంగ్లాదేశ్‌తో జాగ్రత్తగా ఉండాల్సిందే. 2016 టీ20 ప్రపంచకప్‌లోనూ భారత్‌కు బంగ్లాదేశ్ ముచ్చెమటలు పట్టించింది. చివరికి అతి కష్టం మీద భారత్ గట్టెక్కింది.ఇప్పటివరకు టీ0 ప్రపంచకప్‌లో భారత్-బంగ్లాదేశ్ జట్లు మూడుసార్లు తలపడగా మూడుసార్లూ విజయం భారత్‌నే వరించింది.

వైరల్ వీడియో, బంగ్లాదేశ్ మీద గెలుపు కోసం ప్రాక్టీస్‌లో కుస్తీలు పడుతున్న భారత ఆటగాళ్లు

ఇక మూడు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లతో ఉన్న రోహిత్‌ సేనకు సెమీస్‌ బెర్త్‌ ఖాయం కావాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లను కచ్చితంగా గెలవాల్సిందే. అటు బంగ్లా కూడా నాలుగు పాయింట్లతో సెమీస్‌ పోటీలో కొనసాగుతోంది. రన్‌రేట్‌లో మాత్రం భారత్‌దే పైచేయిగా ఉంది.

అడిలైడ్‌లో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో భారత క్రికెటర్లు ఇండోర్‌లోనే తమ ప్రాక్టీ్‌సను కొనసాగించారు. ఇక మ్యాచ్‌ జరిగే బుధవారం కూడా 60 శాతం వరుణుడు ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గంటకు 20-30కి.మీ వేగంతో గాలులు వీస్తాయని సమాచారం. అక్కడి కాలమానం ప్రకారం మ్యాచ్‌ సాయంత్రం 6.30కి ఆరంభం కానుండగా రాత్రి 8 తర్వాత చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకవేళ మ్యాచ్‌ రద్దయి చెరో పాయింట్‌ కేటాయిస్తే సెమీస్‌ రేసు మరింత రసకందాయంలో పడుతుంది. అందుకే వర్షం లేకుండా మ్యాచ్‌ సాగి భారత్‌ విజేతగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

భారత్‌:

రోహిత్‌ (కెప్టెన్‌), రాహుల్‌, కోహ్లీ, సూర్యకుమార్‌, పంత్‌, హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌/చాహల్‌, భువనేశ్వర్‌, షమి, అర్ష్‌దీప్‌ సింగ్‌.

బంగ్లాదేశ్‌:

షంటో, సౌమ్య సర్కార్‌, లిట్టన్‌ దాస్‌, షకీబల్‌ (కెప్టెన్‌), అఫీప్‌ హొస్సేన్‌, మొసద్దెక్‌ హొస్సేన్‌, నురుల్‌ హసన్‌, ముస్తాఫిజుర్‌, హసన్‌ మహ్ముద్‌, టస్కిన్‌ అహ్మద్‌.