Vizag: విశాఖపట్నం వేదికగా ఇండియా -వెస్టిండీస్ (India vs West Indies) మధ్య జరిగిన రెండో వన్డే (2nd ODI) లో 107 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. టీమిండియా నిర్ధేషించిన 388 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ 280 పరుగులకే కుప్పకూలింది. వెస్టిండీస్ లో షయ్ హోప్ 78, నికోలస్ పూరన్ 75 మరియు ఎవిన్ లూయిస్ 30 పరుగులు మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లాగానే, వెస్టిండీస్ కెప్టెన్ కైరన్ పొలార్డ్ కూడా ఆడిన తొలిబంతికే వికెట్ చేజార్చుకొని పరుగులేమి చేయకుండా గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగడం గొప్పవిషయం.
ఇక భారత్ బౌలింగ్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ 3 (హ్యాట్రిక్), మహ్మద్ షమీ 3, రవీంద్ర జడేజా 2, షార్దూల్ ఠాకూర్ 1 వెకెట్ పడగొట్టారు, మరొకటి రనౌట్.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్‌కు, ఒపెనర్లు ఘనమైన ఆరంభాన్ని ఇచ్చారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) 159, కేఎల్ రాహుల్ (KL Rahul) 102 పరుగులతో సెంచరీలు బాదారు. వీరిద్దరి జోడి 200 పరుగుల అజేయమైన ఒపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. చివర్లో శ్రేయాస్ ఐయ్యర్ కూడా 53 కూడా ధాటిగా ఆడటంతో వైజాగ్‌లో పరుగుల తుఫాన్‌ను టీమిండియా తీసుకొచ్చింది. ఫలితంగా భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 387 పరుగుల భారీ స్కోర్ చేసింది.
స్కోర్లు భారత్ 50 ఓవర్లకు 387/5
వెస్టిండీస్ 43.3 ఓవర్లకు 280 ఆలౌట్
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్ తోనూ, బాల్ తోనూ రాణించి విండీస్‌కు ఆల్ రౌండర్ షో చూపించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1 తో సమం అయింది. ఈ మ్యాచ్‌లో 159 పరుగులు చేసిన రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.
సిరీస్‌ను నిర్ణయించే మూడో వన్డే డిసెంబర్ 22న ఆదివారం, ఒడిషా- కటక్ లోని బారాబతి స్టేడియంలో జరగనుంది.