200-run partnership between Rohit & KL Rahul | Photo: BCCI

Vizag, December 18:  విశాఖపట్నం వేదికగా ఇండియా -వెస్టిండీస్ (India vs West Indies) మధ్య  జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్స్ విండీస్ బౌలర్లను ఉతికారేశారు. రోహిత్ శర్మ (Rohit Sharma), కేఎల్ రాహుల్ (KL Rahul) లు సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరి జోడి అజేయమైన 200 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.  వీరిద్దరు ఔట్ అయిన తర్వాత మిడిల్ ఆర్డర్ కూడా రాణించడంతో 50 ఓవర్లలో భారత్ 5 వికెట్లు నష్టపోయి 387 పరుగుల భారీ స్కోర్ చేసింది.

టీ20 సిరీస్ గెలిచి ఊపు మీదున్న భారత్‌కు తొలి వన్డే ఓటమి షాక్ ఇచ్చింది. మూడు వన్డేల సిరీస్ లో వెస్టిండీస్ ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో చేరడంతో సిరీస్ నిలుపుకోవాలంటే రెండో వన్డేలో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి ఒత్తిడిలో రెండో వన్డే ఆడుతున్న టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. తొలి వన్డే లాగా భారత్‌ను కట్టడి చేసి, ఛేజింగ్ చేద్దామనుకున్న వెస్టిండీస్ వ్యూహాన్ని చిత్తు చేస్తూ భారత ఒపెనర్లు దంచికొట్టడంతో వెస్టిండీస్ బౌలర్లు నిస్సహాయంగా మారిపోయారు.

అయితే అంతలోనే 36వ ఓవర్లో చివరి బంతికి భారత్ స్కోర్ 227 ఉన్నప్పుడు కేల్ రాహుల్ 102 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు, ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడిన తొలి బంతికే పోలార్డ్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి పరుగులేమి చేయకుండా గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.

మరోవైపు కెరియర్‌లో 46వ సెంచరీని నమోదు చేసిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 159 పరుగులు చేసి ఔట్ అయ్యాడు ,  చివర్లో రిషభ్ పంత్ 39 మరియు శ్రేయాస్ ఐయ్యర్ 53 కూడా ధాటిగా ఆడి పరుగులు రాబట్టారు. కేదార్ జాదవ్ 16 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఫలితంగా భారత్ 388 పరుగుల భారీ లక్ష్యాన్ని వెస్టిండీస్ కు నిర్ధేషించింది.