India U19 Cricket Team Celebrate (Photo Credits: BCCI)

ICC Under-19 Cricket World Cup 2020: ఐసీసీ అండర్ 19 ప్రపంచ కప్ 2020లో టీమిండియా దుమ్మురేపుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ మరోసారి టైటిల్ ఫేవరెట్ జట్టుగా తన ఆదిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. మంగళవారం పసికూన జపాన్‌తో జరిగిన (India vs Japan) మ్యాచ్‌లో యువ టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న యువ టీమిండియా పదునైన బంతులతో జపాన్ జట్టును బెంబేలెత్తించింది. దీంతో జపాన్ 22.5 ఓవర్లలో కేవలం 41 పరుగులకే ఆలౌట్ అయింది. 42 పరుగుల అతి స్వల్ప లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన భారత జట్టు కేవలం 4.5 ఓవర్లనే ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 29*, కుమార్ కుషాగ్రా 13* పరుగులతో పని పూర్తి చేశారు. ఈ విజయంతో భారత్ అండర్ 19 ప్రపంచ కప్ 2020లో క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన జపాన్ జట్టులో, టీమిండియా బౌలర్ల ధాటికి 5 గురు బ్యాట్స్‌మెన్ డకౌట్ అయ్యారు.  8 ఓవర్లు వేసిన భారత బౌలర్ బిష్నోయి ( Ravi Bishnoi), కేవలం 5 పరుగులు ఇచ్చి, 4 వికెట్లు కూల్చాడు. అతడికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.

Ravi Bishnoi, The Magician

జపాన్ సాధించిన 41 పరుగుల స్కోర్ అండర్ 19 ప్రపంచ కప్ చరిత్రలో  రెండో అత్యల్ప స్కోరు. అంతకుముందు అత్యల్ప స్కోర్ 22 పరుగులకే ఆలౌట్ జట్టుగా స్కాట్లాండ్ చెత్త రికార్డుల్లో ఉంది.

ప్రస్తుతం గ్రూప్ Aలో 2 విజయాలతో, 4 పాయింట్లు సాధించి +3.702 రన్ రేటుతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆ తర్వాత న్యూజిలాండ్, శీలంక , జపాన్ జట్టులు తర్వాత స్థానంలో ఉన్నాయి.