Uday Saharan: ట్రోఫీ అంతా రాణించాడు, ఫైన‌ల్ లో మాత్రం చ‌తికిలా ప‌డ్డాడు! తుదిపోరులో చేతులెత్తేసిన కెప్టెన్ల స‌ర‌స‌న చేరిన అండ‌ర్-19 కెప్టెన్ ఉద‌య్ స‌హ‌ర‌న్
Uday Saharan (PIC @ BCCI X)

New Delhi, FEB 11: ఐసీసీ టోర్నీలలో అత్యద్భుత ప్రదర్శనలతో నాకౌట్‌ (Knockout) దశకు చేరడం.. కానీ తీరా కీలక మ్యాచ్‌లలో చేతులెత్తేయడం భారత క్రికెట్‌ జట్టుకు (Team India U-19) కొత్తేం కాదు. గత పదేండ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో మెన్‌ ఇన్‌ బ్లూ తడబాటు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. కొద్దిరోజుల క్రితమే భారత్‌ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌లో (ICC Under 19 World Cup 2024) ఫైనలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. తాజాగా దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్‌ – 19 మెన్స్‌ వరల్డ్‌ కప్‌లోనూ భారత్‌దీ ఇదే పరిస్థితి. ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఆసీస్‌ చిత్తు చేసి నాలుగో ట్రోఫీ సొంతం చేసుకుంది. అయితే ఎప్పటిలాగే ఫైనల్‌ దాకా సూపర్‌ డూపర్‌ ఆటతో రెచ్చిపోయి.. తీరా తుదిపోరులో చేతులెత్తేసే భారత సారథుల జాబితాలో ఉదయ్‌ సహరన్‌ (Uday Saharan) చేరాడు. ఈ టోర్నీలో ఉదయ్‌ సహరన్‌ టాప్‌ స్కోరర్‌. ఫైనల్‌కు ముందు ఆడిన మ్యాచ్‌లలో ఉదయ్‌ (Uday Saharan) అంచనాలకు మించి రాణించాడు. లీగ్‌ దశలో బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్‌లో 64 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన అతడు.. ఆ తర్వాత 75 (ఐర్లాండ్‌పై), 35 (యూఎస్‌ఎపై), 34 (న్యూజిలాండ్‌పై) పరుగులు చేశాడు. సూపర్‌ సిక్స్‌ దశలో నేపాల్‌తో మ్యాచ్‌లో సెంచరీ (100) కొట్టాడు. సెమీస్‌లో భారత టాపార్డర్‌ విఫలమైన చోట.. సఫారీ బౌలర్లను ఎదుర్కుని 81 పరుగులు చేసి భారత్‌ను ఫైనల్‌ చేర్చడంలో అతడిదే కీ రోల్‌. టోర్నీ ఆసాంతం రాణించిన అతడే టాప్‌ స్కోరర్‌. ఆరు ఇన్నింగ్స్‌లలో 389 పరుగులు చేసిన సహరన్‌.. ఫైనల్‌లో ఆసీస్‌తో 8 పరుగులకే ఔటయ్యాడు.

 

ఫైనల్‌లో భారత కెప్టెన్‌ విఫలమవడం భారత అభిమానులకు ఇదేం కొత్త కాదు. 2000లో భారత్‌ తొలి ట్రోఫీ నెగ్గినప్పట్నుంచి ఇప్పటి 9వ ఫైనల్‌ దాకా ఒక్క ఉన్ముక్త్‌ చంద్‌ (2012లో) మినహా మిగిలిన కెప్టెన్లందరూ విఫలమయ్యారు. మహ్మద్‌ కైఫ్‌ నుంచి మొదలుకుని విరాట్‌ కోహ్లీ, ఇషాన్‌ కిషన్‌, పృథ్వీ షా, ప్రియమ్‌ గార్గ్‌, యశ్‌ ధుల్‌.. అందరూ ఫైనల్‌లో విఫలమైనవాళ్లే.

అండర్ – 19 వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌లో భారత సారథుల స్కోర్లు ఇవి..

1. మహ్మద్‌ కైఫ్‌ : 18 (2000) – భారత్‌ విజయం

2. రవికాంత్‌ శుక్లా : 1 (2006) – ఓటమి

3. విరాట్‌ కోహ్లీ : 19 (2008) – విజయం

4. ఉన్ముక్త్‌ చంద్‌ : 111 (2012) – విజయం

5. ఇషాన్‌ కిషన్‌ : 4 (2016) – ఓటమి

6. పృథ్వీ షా : 29 (2018) – విజయం

7. ప్రియమ్‌ గార్గ్‌ : 7 (2020) – ఓటమి

8. యశ్‌ ధుల్‌ : 17 (2022) – విజయం

9. ఉదయ్‌ సహరన్‌ : 8 (2024) – ఓటమి