Budapest, SEP 22: చెస్ ఆటను ఏలుతున్న భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. ఒలింపిక్స్ తరహాలో జరిగే ఫిడె చెస్ ఒలింపియాడ్‌లో (Chess Olympiad) దేశానికి తొలిసారి స్వర్ణం అందించారు. హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో భారత బృందం పసిడి కాంతులు విరజిమ్మింది. ఆదివారం నల్ల పావులతో ఆడిన గ్రాండ్‌మాస్టర్ డి. గుకేశ్(D.Gukesh) రష్యా ఆటగాడు వ్లాదిమిర్ ఫెడోసీవ్‌పై అద్భుత విజయంతో దేశానికి బంగారు పతకం సాధించి పెట్టాడు. ఈ టోర్నీలో గుకేశ్‌తో పాటు అర్జున్ ఎరిగేసి, ఆర్ ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీ, పీ హరికృష్ణ, శ్రీనాథ్ నారాయణన్(కెప్టెన్)లతో కూడిన బృందం అద్భుతంగా రాణించింది. రెండేండ్లకు ఓ సారి జరిగే ఈ టోర్నీలో 2022 లోకాంస్యంతో సరిపెట్టుకున్న భారత్‌కు ఈసారి స్వర్ణం దక్కడం గమనార్హం. 2014లోనూ ఇండియా కంచు మోత మోగించింది.
Here's Tweet
A series of outstanding performances by @DGukesh 📈👀 #ChessOlympiad pic.twitter.com/t3rsfjT1iP
— Chess.com (@chesscom) September 22, 2024
ఫిడె చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల బృందం అదరగొట్టింది. ఆదివారం జరిగిన పోటీల్లో గుకేశ్, అర్జున్‌లు స్లోవేనియా ఆటగాళ్లకు చెక్ పెట్టారు. చివరి రౌండ్‌లో భారత్ 19 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. చైనా(17 పాయింట్లు), స్లోవేనియా(16 పాయింట్లు)లు వరుసగా రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. మహిళల విభాగంలో భారత్, కజకిస్థాన్ జట్లు 17 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాయి. ఇక అమెరికా, పోలండ్ దేశాలు 16 పాయింట్లు సాధించి సంయుక్తంగా రెండో స్థానంతో సరిపెట్టుకున్నాయి.