Paralympic Games Paris 2024

పారాలింపిక్ క్రీడలు పారిస్ 2024: సమ్మర్‌ ఒలింపిక్స్‌ ముగిసిన రెండు వారాల తర్వాత... పారిస్‌ వేదికగా బుధవారం నుంచి దివ్యాంగ క్రీడాకారులు పోటీపడే పారాలింపిక్స్‌ స్టార్ట్ అయ్యాయి. 100 ఏళ్ల తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ఒలింపిక్స్‌ నిర్వహించిన పారిస్‌ నగరంలోనే ఈసారి పారాలింపిక్స్‌ జరగబోతున్నాయి. దీన్ని కూడా విజయవంతం చేసేందుకు అన్నీ చర్యలు చేపట్టింది పారిస్ ప్రభుత్వం.

మొత్తం 11 రోజుల పాటు సాగనున్న ఈ క్రీడల్లో మొత్తం 4,400 మంది పారా అథ్లెట్లు పాల్గొంటున్నారు. 22 క్రీడాంశాల్లో 549 పతకాలు సాధించే అవకాశం ఉండగా... నేడు ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఘనంగా ఆరంభ వేడుకలు జరగనున్నాయి. టోక్యో పారాలింపిక్స్‌తో పోలిస్తే... పారాలింపిక్ క్రీడలు పారిస్ 2024 మహిళల విభాగాల్లో మరో 10 మెడల్‌ ఈవెంట్స్‌ను జోడించారు.  నేటి నుంచి పారాలింపిక్ క్రీడలు పారిస్ 2024, గూగుల్ స్పెషల్ డూడుల్ ఇదిగో, 11 రోజుల పాటు అలరించనున్న 17వ సమ్మర్ పారాలింపిక్ గేమ్స్

ఈసారి భారత్‌ నుంచి 84 మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. దివ్యాంగుల విశ్వక్రీడల్లో భారత్‌ నుంచి అత్యధికంగా ఈసారే పోటీ పడుతున్నారు. టోక్యో క్రీడల్లో 54 మంది పోటీపడగా భారత్‌ 5 స్వర్ణాలు సహా 19 పతకాలు సాధించి పతకాల పట్టికలో 24వ స్థానంలో నిలిచింది. ఈసారి 12 క్రీడాంశాల్లో 10కి పైగా స్వర్ణాలతో పాటు 25 పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంధర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ విడుదల చేసింది. పారాలింపిక్స్‌ చరిత్రలో తొలిసారి స్టేడియం బయట నిర్వహించనున్న ఆరంభ వేడుకల్లో జావెలిన్‌ త్రోయర్‌ సుమిత్‌ అంటిల్‌, షాట్‌పుటర్‌ భాగ్యశ్రీ జాధవ్‌ త్రివర్ణ పతాకధారులుగా వ్యవహరించనున్నారు.

గత ఏడాది హాంగ్జూలో జరిగిన ఆసియా పారా క్రీడల్లో మనవాళ్లు 29 స్వర్ణాలు సహా 111 పతకాలతో సత్తాచాటారు. ఇక ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ఆరు స్వర్ణాలతో పాటు మొత్తం 17 పతకాలు సాధించి ఆరో స్థానంలో నిలిచారు. పురుషుల జావెలిన్‌త్రో ఎఫ్‌ 64 విభాగంలో ప్రపంచ రికార్డు హోల్డర్‌ సుమిత్‌ అంటిల్‌, మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌1 విభాగం అవని లేఖరా డిఫెండింగ్‌ పారాలింపిక్‌ చాంపియన్‌లుగా బరిలోకి దిగుతున్నారు.

చేతులు లేకున్నా కాళ్లతో గురి తప్పకుండా బాణాలు సంధించగల పారా ఆర్చర్‌ శీతల్‌ దేవి, మందుపాతర పేలిన దుర్ఘటనలో కాళ్లు కోల్పోయిన షాట్‌పుటర్‌ హొకాటో సెమా, ఆంధ్రప్రదేశ్‌ రోయింగ్‌ ప్లేయర్‌ నారాయణ కొంగనపల్లె వంటి వాళ్లు కూడా పారాలింపిక్స్‌లో పోటీ పడుతున్నారు. తెలంగాణ నుంచి జివాంజి దీప్తి మహిళల 400 మీటర్ల టి20 విభాగంలో పోటీ పడుతోంది.

పోటీల తొలి రోజు తైక్వాండో, టేబుల్‌ టెన్నిస్‌, స్విమ్మింగ్‌, సైక్లింగ్‌ క్రీడాంశాల్లో మెడల్‌ ఈవెంట్స్‌ జరగనున్నాయి. సమ్మర్‌, వింటర్‌ పారాలింపిక్స్‌లో కలిపి ఇప్పటికే 7 స్వర్ణాలు సహా 17 పతకాలు నెగ్గిన అమెరికా మల్టీ స్పోర్ట్స్‌ స్పెషలిస్ట్‌ ఒక్సానా మాస్టర్స్‌ హ్యాండ్‌ సైక్లింగ్‌లో మరిన్ని పతకాలపై దృష్టి పెట్టింది. ఇక పారాలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు నెగ్గిన ఈజిప్ట్‌ పారా పవర్‌లిఫ్టర్‌ షరీఫ్‌ ఉస్మాన్‌ నాలుగో పసిడి సాధించాలనే లక్ష్యంతో పారిస్‌ పారాలింపిక్స్‌లో బరిలోకి దిగుతున్నాడు.