PT Usha (Photo credit: Instagram)

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలని, అతనిపై విచారణ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలంటూ జంతర్‌మంతర్‌ దగ్గర రెజ్లర్లు మళ్లీ ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ దేశ రాజధానిలో ఐదు రోజులుగా నిరసన కొనసాగిస్తున్న అగ్రశ్రేణి రెజ్లర్లకు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) నుంచి అనూహ్య స్పందన ఎదురైంది.

వారి తీరును తప్పుపడుతూ ఐఓఏ అధ్యక్షురాలు, దిగ్గజ అథ్లెట్‌ పీటీ ఉష వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. వారు వీధుల్లోకి వెళ్లకుండా ఉండాల్సిందని ఆమె సూచించింది. లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు ఐఓఏలో ఒక కమిటీతో పాటు అథ్లెటిక్స్‌ కమిషన్‌ కూడా ఉంది. వారంతా వీధుల్లోకి వెళ్లకుండా మా వద్దకు రావాల్సింది. కానీ వారు అలా చేయలేదు. కొంత క్రమశిక్షణ కూడా అవసరం. వారు చేస్తున్న పని ఆటకు మంచిది కాదు. ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు మంచి పేరు ఉంది.

నేను చావును కోరుకుంటున్నాను, రెజ్లర్ల నిరసన లైంగిక వేధింపుల ఆరోపణలపై వీడియో విడుదల చేసిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్

ఇలాంటి నిరసనల వల్ల దేశం పరువు పోతోంది. ఈ తరహా ప్రతికూల ప్రచారం దేశానికి మంచిది కాదు. ఏదైనా చట్టప్రకారం ఉండాలి. వారంతా ధర్నాలో కూర్చొని రాజకీయ పార్టీల మద్దతు కోరడం నన్ను తీవ్రంగా నిరాశపరుస్తోంది’ అని పీటీ ఉష అభిప్రాయపడింది.

ఉష మాటలపై స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆమె స్వయంగా ఒక అథ్లెట్‌. పైగా మహిళ కూడా. మేం ఆమె మద్దతు కోరుకున్నాం. కానీ ఆమె నుంచి ఇలాంటి తీవ్రమైన స్పందన ఊహించలేదు. రెజ్లర్ల చర్య వల్ల భారత్‌ పరువు పోతోంది అని భావిస్తే గతంలో తన అకాడమీలో కొందరు గూండాలు తనను వేధిస్తున్నారంటూ ఆమె అందరి ముందు ఏడవలేదా. అప్పుడేం జరిగింది’ అంటూ బజరంగ్‌ గుర్తు చేశాడు.

దేశం కోసం ఆడిన వారు వీధుల్లో ధర్నా చేస్తుంటే గుండె కలిచివేస్తోంది, రెజ్లర్ల మర్యాదను కాపాడే బాధ్యత మనదని ట్వీట్ చేసిన నీర‌జ్ చోప్రా

ఇలాంటి ప్రతికూల చర్య దేశానికి మంచిది కాదు. కేవలం రెజ్లర్లతోనే కాదు దేశంలోని ప్రతి ఒక్క అథ్లెట్‌తో మేముంటాం. కానీ దేశంలోని చట్టం, న్యాయం ప్రకారం ముందుకెళ్తాం. ఐఓఏ విచారణ ముగిసేంతవరకూ రెజ్లర్లు ఎదురు చూడాల్సింది. ఇవి తీవ్రమైన ఆరోపణలు. తొందరపాటుతో నిర్ణయం తీసుకోలేం. రెజ్లర్ల ఆరోపణలపై ఐఓఏ విచారణ కొనసాగుతోంది. కేంద్ర క్రీడా శాఖ మంత్రిత్వ ఆదేశాల మేరకు డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల నిర్వహణ, కొత్త పాలక వర్గం వచ్చేంత వరకూ సమాఖ్య రోజూవారీ వ్యవహారాల కోసం ముగ్గురు సభ్యుల అడ్‌హాక్‌ కమిటీని ఏర్పాటు చేశాం’’ అని ఐఓఏ సంయుక్త కార్యదర్శి కళ్యాణ్‌ చౌబే తెలిపాడు.

తొలిసారి రెజ్లర్లు నిరసనకు దిగినప్పుడు బ్రిజ్‌ భూషణ్‌పై లైంగిక హింస ఆరోపణల విచారణ కోసం ప్రభుత్వంతో పాటు ఐఓఏ కూడా ఓ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ విచారణ కమిటీ నివేదిక అందించగా.. ఐఓఏ కమిటీ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. మరోవైపు రెజ్లర్లు మరోసారి ధర్నాకు దిగిన నేపథ్యంలో మే 7న జరగాల్సిన డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల ప్రక్రియను రద్దు చేసిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ.. 45 రోజుల్లోపు ఈ ఎన్నికలు నిర్వహించేందుకు అడ్‌హక్‌ కమిటీని నియమించాలని ఐఓఏను ఆదేశించిన విషయం విదితమే.

రెజ్లర్ల సమస్యను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ నిష్పక్షపాతంగా విచారణ జరుపుతోందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. తమ వైపు నుంచి అన్ని విషయాలను వెల్లడించేందుకు రెజ్లర్లకు తగినంత అవకాశం ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. మూడు నెలల క్రితం తొలిసారి వారు నిరసన జరిపినప్పుడు తాను స్వయంగా 12 గంటల పాటు వారితో చర్చలు జరిపానని... విచారణ కమిటీ 14 సార్లు సమావేశాలు నిర్వహించి ఆటగాళ్లు తమ బాధలు చెప్పుకునే అవకాశం ఇచ్చిందని ఠాకూర్‌ అన్నారు.