Spain, July 14: స్పెయిన్ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) అంచనాలను అందుకుంటూ వింబుల్డన్ (Wimbledon) టైటిల్‌ను ముద్దాడాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఈ యంగ్‌స్టర్ తన గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల సంఖ్యను పెంచుకున్నాడు. ఆదివారం ఏకపక్షంగా సాగిన ఫైనల్ పోరులో అల్కారాజ్ తన పదునైన సర్వ్‌లలో నొవాక్ జకోవిచ్ (Novak Djokovic)ను మట్టికరిపించి చాంపియన్‌గా నిలిచాడు. దాంతో 21 ఏండ్ల వయసులోనే రెండో వింబుల్డన్ టైటిల్‌తో అల్కరాజ్ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు అరుదైన క్లబ్‌లో చోటు సంపాదించాడు. ఒకే ఏడాదిలో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ట్రోఫీ నెగ్గిన ఆరో ఆటగాడిగా అల్కరాజ్ రికార్డు పుస్తకాల్లోకెక్కాడు.
To win here is special. To defend here is elite.
Carlos Alcaraz is the 2024 Gentlemen’s Singles Champion 🏆#Wimbledon pic.twitter.com/kJedyXf0vn
— Wimbledon (@Wimbledon) July 14, 2024
అల్కరాజ్ కంటే మందు ఒకే ఏడాది మట్టి కోర్టులో, గ్రాస్ కోర్టులో ఐదుగురు మాత్రమే టైటిళ్లు గెలుపొందారు. వాళ్లు ఎవరంటే..? టెన్నిస్ దిగ్గజాలు రాడ్ లవర్(ఆస్ట్రేలియా), జోర్న్ బోర్గ్(స్వీడన్), రఫెల్ నాదల్ (స్పెయిన్), రోజర్ ఫెదరర్(స్విట్జర్‌లాండ్), నొవాక్ జకోవిచ్(సెర్బియా)లు ఈ ఫీట్ సాధించారు. ఇప్పుడు అల్కరాజ్ వీళ్ల సరసన చేరి తానొక భవిష్యత్ స్టార్ అని నిరూపించుకున్నాడు. అంతేకాదు మాజీ నంబర్ 1 నాదల్ తర్వాత ఈ మైలురాయికి చేరిన స్పెయిన్ ప్లేయర్‌గా మరో రికార్డు లిఖించాడు.
సెంటర్ కోర్టులో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో అల్కరాజ్ విజయ గర్జన చేశాడు. టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (Novak Djokovic)ను చిత్తుగా ఓడించి రెండో ఏడాదిలోనూ చాంపియన్ అయ్యాడు. తొలి సెట్ నుంచి దూకుడుగా ఆడిన అల్కరాజ్.. నిర్ణయాత్మక మూడో సెట్‌లో మరింత చెలరేగాడు. 6-2, 6-2, 7-6 జకోను వణికించి ట్రోఫీ సొంతం చేసుకున్నాడు. దాంతో, సింగిల్స్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గాలనుకున్న జకో కల కలగానే మిగిలింది.