Amaravati, Oct 30: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (East Godavari Road Accident) చోటు చేసుకుంది. జిల్లాలోని గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా (Gokavaram Road Accident) పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
దీంతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం పూర్తయిన తర్వాత తిరిగి వస్తూ వ్యాన్ ప్రమాదానికి గురైంది.
ఆలయంలో పార్కింగ్ ప్లేస్ మీదుగా రోడ్డు మీదికి రావాల్సిన వ్యాన్ మెట్లు పై నుంచి ఒక్కసారిగా కింద పడినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 17 మంది పెళ్లి బృందం ఉన్నారు. మృతులు శ్రీదేవి, శ్రీలక్ష్మి, భాను, ప్రసాద్, దొరగా పోలీసులు గుర్తించారు. వధువు.. స్వస్థలం రాజానగరం మండలం వెలుగుబంద కాగా, వరుడు స్వస్థలం గోకవరం (Gokavaram) మండలం ఠాకూర్‌పాలెనికి చెందిన వారిగా గుర్తించారు. బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.