Tirupathi November 18: ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో కుండపోత వానలు పడుతున్నాయి. ముఖ్యంగా తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలిపిరి నడకమార్గం, కనుమదారుల్లో వరద నీటితో పోటెత్తుతున్నది. అటవీప్రాంతం భారీగా వస్తున్న వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. నీటి ప్రవాహంతో మెట్లమార్గం జలపాతంలా కనిపిస్తున్నది. వైకుంఠం క్యూలైన్‌లోని సెల్లార్లలోకి నీరు చేరింది. వర్షానికి మాడవీధులు జలమయమయ్యాయి. భారీ వర్షంతో రెండో కనుమదారి ప్రమాదకరంగా మారింది. రహదారిపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. కొండపై నుంచి రహదారిపైకి రాళ్లు, మట్టి కొట్టుకు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన టీటీడీ బోర్డు వాటిని తొలగిస్తోంది. వర్షాలతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇక శేషాచలకొండల నుంచి తిరుపతి నగరంలోకి వరద భారీగా వస్తున్నది. తుమ్మలగుంట చెరువు కట్ట తెగిపోయింది. కల్యాణి డ్యామ్ నిండిపోవడంతో అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. వరద ఉధృతికి వరదరాజనగర్‌లో వాహనాలు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రైల్వే అండర్ బ్రిడ్జిలు నీటితో నిండిపోయాయి. కరకంబాడి మార్గంలో భారీగా వరద నీరు చేరింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షంతో తిరుపతిలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.
మరోవైపు తమిళనాడులోనూ భారీవర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నైకి భారీ వర్ష సూచన ఉందని ఐఎండీ హెచ్చరించింది. దీంతో ముందస్తు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం అల్పపీడనం తీరం దాటే అవకాశముందని, ఆ సమయంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు ఐఎండీ అధికారులు. దీంతో భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ముంపు ప్రాంతాల ప్రజలను ముందస్తు చర్యగా తరలిస్తున్నారు. తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు, కడలూరులో అతిభారీ వర్షాలు కురుస్తాయని, విళ్లుపురం జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. చెన్నైలో 20 సెంటీమీట్ల కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. దీంతో చెన్నై కార్పొరేషన్‌లో వార్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. అటు కర్ణాటక, పుదుచ్చేరిల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.