Vjy, July 25: ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభలో పలు అంశాలపై సమావేశాల్లో (Andhra Pradesh Assembly Session) చర్చలు చేపట్టారు. వైసీపీ హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందంటూ శ్వేతపత్రాన్ని సీఎం చంద్రబాబు శాసనసభలో బుధవారం విడుదల చేశారు. ఇది దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి కుంభకోణాన్ని చూడలేదని అన్నారు.
ఈ మద్యం కుంభకోణంపై సీఐడీతో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభ వేదికగా ప్రకటించారు. అవసరమైతే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సహకారం కూడా తీసుకుంటామని, వారికి కేసు రిఫర్ చేస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం (YCP government) విక్రయించిన మద్యం వల్ల ఎంతమంది ఆరోగ్యాలు నాశనమయ్యాయి? ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? ఎంతమంది మంగళసూత్రాలు తెగిపోయాయి తదితర లెక్కలన్నీ వైద్యారోగ్య శాఖ ద్వారా తేలుస్తామని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై ఏపీ అసెంబ్లీలో చర్చ, సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..
రాష్ట్ర ఖజానాకు సమకూరాల్సిన ఆదాయాన్ని ఎలా పక్కదారి పట్టించారో దర్యాప్తు ద్వారా బయటపెడతామన్నారు. ‘గత ఐదేళ్లలో దాదాపు రూ.లక్ష కోట్ల విలువైన మద్యం విక్రయాలు నగదు రూపంలోనే జరిగాయి. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్ము విషయంలో ఇంత పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరగటం ఎక్కడా లేదు. తద్వారా నల్లధనం పోగేసుకున్నారు. సొంత డిస్టిలరీల ఏర్పాటు, మద్యం తయారీ, సరఫరా ఇలా ప్రతి దశలోనూ అక్రమాలకు పాల్పడ్డారు’ అని చంద్రబాబు అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో జరిగిన అవకతవకల్ని సంబంధిత మంత్రులు బయటపెట్టాలని తెలిపారు. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాల్సిందే. భవిష్యత్తులో ఎవరైనా తప్పు చేయాలంటే భయపడాలి. ఆ దిశగా అందరం ఆలోచిద్దాం. మీ సలహాలు ఇవ్వండి’ అని చంద్రబాబు సభ్యుల్ని కోరారు.మద్యం రేట్లు విపరీతంగా పెంచేయటంతో.. తక్కువ ధరకు లభిస్తుందని చాలామంది నాటుసారాకు, గంజాయికి అలవాటుపడ్డారు. ఇళ్లల్లోనూ, పొలాల్లో సైతం గంజాయి పండించారు.
చివరికి ఆకుకూరల మాదిరిగా బండ్లపై గంజాయి విక్రయించే పరిస్థితి వచ్చింది. గంజాయి తాగి ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. వినుకొండలో కూడా గంజాయి మత్తులోనే హత్య చేశారు. అందుకే గంజాయి, మాదకద్రవ్యాల కట్టడికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాం. జంగారెడ్డిగూడెంలో కల్తీసారా వల్ల 21 మంది ప్రాణాలు కోల్పోయారు’ అని చంద్రబాబు వెల్లడించారు.