Amaravati, Sep 15: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం కూడా వర్షం జోరుగా కురిసింది. రెండ్రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలతో (Andhra Pradesh Floods) పలు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు జిల్లాల్లో చెరువులు పూర్తిగా నిండిపోయాయి. రోడ్లపై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరుచేరింది. రాష్ట్రంలోని 19,494 హెక్టార్లలో పంటలపై వర్ష ప్రభావం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. చేలల్లోని నీటిని బయటకు పంపితే పంటలకు పెద్దగా నష్టం ఉండదని చెబుతున్నారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు (Andhra Pradesh Rains), అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు 3 నుంచి 3.4 మీటర్ల ఎత్తు వరకూ ఎగసి పడతాయని అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయనీ, మత్స్యకారులెవ్వరూ సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.
Here's The Tweet
#WATCH Andhra Pradesh: 70 gates of Prakasam barrage on Krishna river at Vijayawada lifted to release huge inflow of floodwater from upper areas, following incessant rainfall in the region. People living in low-lying areas alerted. Control rooms set up in all divisional offices. pic.twitter.com/XTrG0tceVd
— ANI (@ANI) September 15, 2020
కర్నూలు జిల్లాలో 24 గంటల్లో 31.3 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. పాములపాడులో రికార్డు స్థాయిలో 184.6 మి.మీ వర్షం కురిసింది. పెన్నా, కుందూ నదులు, సగిలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వైఎస్సార్ జిల్లాలో ఒక్కరోజే 48.9 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇసుక వంక పోటెత్తడంతో జమ్మలమడుగు, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ పట్టణాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో 300 చెరువులు పూర్తిగా నిండాయి.
గుంటూరు జిల్లాలోని కొండవీటివాగు, పొట్టేళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సచివాలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు హైవేపైకి చేరడంతో దాచేపల్లిలో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. కృష్ణా జిల్లాలో సగటున 50.70 మి.మీ. వర్షం కురిసింది. తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో వైరా, కట్టలేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో నందిగామ, వీరుళ్లపాడు మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ నుంచి వరదతో పశ్చిమ గోదావరి జిల్లాలోని తమ్మిలేరు రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. తమ్మిలేరు, ఎర్రకాల్వ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని కిందకి వదులుతున్నారు. దీంతో ఏలూరు వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక విజయనగరం జిల్లాలో, ప్రకాశం జిల్లా మార్కాపురం రెవెన్యూ డివిజన్‌లో, చిత్తూరు జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది.
కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి విడుదల చేస్తున్న కృష్ణా జలాలకు.. తుంగభద్ర వరద తోడవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,25,082 క్యూసెక్కులు చేరుతున్నాయి. దీంతో క్రస్ట్ గేట్లను తెరచి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది క్రస్ట్ గేట్లను తెరవటం ఇది నాలుగోసారి. ఎగువన ఉన్న జూరాల, సుంకేసుల జలాశయాలతోపాటు హంద్రీ నది నుంచి శ్రీశైలానికి జలాలు వచ్చి చేరుతున్నాయి. కుడిగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ మొత్తంగా 2,54,526 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం శ్రీశైలంలో 884.80 అడుగుల్లో 214.36 టీఎంసీలు ఉన్నాయి. నాగార్జున సాగర్లోకి 2,14,082 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరింది. అంతే స్థాయిలో వరద జలాలను స్పిల్ వే గేట్లు, విద్యుత్ కేంద్రం ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతలలోకి 2,30,541 క్యూసెక్కులు చేరుతుండగా.. 2,32,404 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.దీనికి తోడు ప్రకాశం బ్యారేజీలోకి 2,70,822 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. బ్యారేజీ వద్ద 70 గేట్లు ఎత్తి 2,24,931 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
ఛతీస్‌గఢ్, ఒడిశా, వరంగల్, ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 2,10,427 క్యూసెక్కులు చేరుతుండగా.. డెల్టా కాలువలకు విడుదల చేయగా మిగిలిన 2,07,341 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ఇక వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో పెన్నా, దాని ఉప నదులు పోటెత్తాయి. దాంతో గండికోట, మైలవరం ప్రాజెక్టుల గేట్లు ఎత్తేశారు. సోమశిల ప్రాజెక్టులోకి 47,491 క్యూసెక్కులు చేరుతుండటంతో సోమశిలో నీటి నిల్వ 61 టీఎంసీలకు చేరుకుంది. మరో 17 టీఎంసీలు చేరితే సోమశిల నిండిపోతుంది.