Vjy, July 8: ఏపీలో (Andhrapradesh) ఉచిత ఇసుక పాలసీపై (Free Sand Policy) జీవోను రాష్ట్ర ప్రభుత్వం (AP Government) సోమవారం మధ్యాహ్నం విడుదల చేసింది. దీని ప్రకారం.. పాత ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. 2024 ఇసుక విధానం రూప కల్పన వరకూ సరఫరాకు మార్గదర్శకాలు జారీ చేసింది.
2019, 2021లో అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. కొత్త ఇసుక విధానాన్ని తెచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి వరకు వినియోగదారుడికి ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో నంబర్ 43ను జారీ చేసింది. వినియోగదారుడు ఎత్తుడు, దించుడు కూలీతో ఇతర చట్టబద్ధమైన పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. ఉచిత ఇసుక పాలసీ అమలుకు రంగం సిద్ధం, టన్నుకు రూ. 88 వసూలు చేయనున్న ప్రభుత్వం
కొత్త ఇసుక విధానాన్ని రూపొందించే వరకు ఈ విధివిధానాలు వర్తిస్తాయని, రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు జారీ చేసినట్లు వెల్లడించింది.ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ కమిటీల్లో జిల్లా ఎస్పీ, సంయుక్త కలెక్టర్ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఉండాలని పేర్కొంది. జిల్లాల్లోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని ఆ కమిటీలకు సూచించింది. రాష్ట్రంలోని వివిధ స్టాక్ పాయింట్లలో 49 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఇసుక అందుబాటులో ఉందని ప్రభుత్వం వెల్లడించింది.
రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో డి-సిల్టేషన్ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డి-సిల్టేషన్ ఎక్కడెక్కడా చేపట్టాలనేది జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయిస్తాయని, ఇసుల లోడింగ్, రవాణా ఛార్జీలను నిర్థారించే బాధ్యత కూడా జిల్లా కమిటీలకే ఉంటుందని తెలిపింది. స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్, రవాణా ఛార్జీల చెల్లింపులను కేవలం డిజిటల్ విధానం ద్వారానే జరపాలని స్పష్టం చేసింది. ఇసుకను తిరిగి విక్రయించినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు ఉంటాయని, భవన నిర్మాణ మినహా ఉచిత ఇసుకను మరే ఇతర అవసరాలకు వినియోగించవద్దని తెలిపింది. ఇసుక అక్రమ రవాణా చేసినా, ఫిల్లింగ్ చేసినా జరినామాలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.