Three Capitals Bill Repealed: మూడు రాజధానుల బిల్లు రద్దు, ఇంటర్వెల్‌ మాత్రమే అయింది, శుభంకార్డు ఇంకా పడలేదని తెలిపిన మంత్రి పెద్దిరెడ్డి, 10 నిమిషాలు ఆగితే అన్ని విషయాలు తెలుస్తాయని తెలిపిన మంత్రి కొడాలి నాని
Andhra Pradesh Mining Minister Peddireddy Ramachandra Reddy (File Photo/ANI)

Amaravati, Nov 22: రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను ఏపీ ప్రభుత్వం రద్దు (Three Capitals Bill Repealed) చేసిందని ఏపీ హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కాసేపటి క్రితం ఏపీ కేబినెట్ అత్యవసరంగా సమావేశమైందని... ఈ సమావేశంలో మూడు రాజధానులపై తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం (Andhra Pradesh government) వెనక్కి తీసుకుందని కోర్టుకు తెలిపారు. ఈ చట్టాల రద్దుపై ముఖ్యమంత్రి జగన్ కాసేపట్లో అసెంబ్లీలో ప్రకటన చేస్తారని చెప్పారు. అయితే చట్టాల ఉపసంహరణ అంశాన్ని పూర్తి స్పష్టతతో చెప్పాలని ధర్మాసనం చెప్పింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది.

ఇక మూడు రాజధానుల బిల్లు (Three Capital Bill) ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యాయపరమైన చిక్కుల వల్లే ఈ పరిస్థితి ఉండొచ్చు. కేబినెట్‌ సమావేశంలో నేను లేను. పూర్తి వివరాలు తెలీదు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం. ఇప్పుడు ఇంటర్వెల్‌ మాత్రమే. శుభం కార్డుకు చాలా సమయం ఉంది. రాజధాని పేరుతో ఉద్యమం చేసేది పెయిడ్‌ ఆర్టిస్టులే అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.

మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం, కాసేపట్లో అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ అధికారికంగా ప్రకటన

ఇదే విషయంపై మంత్రి కొడాలి నాని స్పందిస్తూ.. కొందరు కోర్టుకెళ్లి అడ్డంకులు సృష్టించారు. అమరావతిపై ఏపీ కేబినెట్‌లో చర్చించాం. కేబినెట్‌ నిర్ణయాన్ని అసెంబ్లీలో వివరిస్తామని మంత్రి కొడాలి నాని అన్నారు. సీఎం జగన్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదని అన్నారు. మరో 10 నిమిషాలు ఆగితే అన్ని విషయాలపై క్లారిటీ వస్తుందని చెప్పారు. కొడాలి నాని వ్యాఖ్యలతో జనాల్లో ఉత్కంఠ మరింత పెరుగుతోంది. అసలు ఏం జరగబోతోందని, జగన్ ఏం చెప్పబోతున్నారనే ఆసక్తి పెరుగుతోంది.