Amaravati, May 12: కరోనా కట్టడి కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బారిన పడి ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి పిల్లలకు ప్రత్యేక సంరక్షణ కేంద్రాల ఏర్పాటు (Care centres for children of COVID patients) చేయాలని నిర్ణయించుకుంది.
కోవిడ్ బారిన పడి తల్లిదండ్రులు (COVID patients) మరణించి అనాథలైన పిల్లలకు ఈ సంరక్షణ కేంద్రాల్లో వసతి కల్పించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి.. వాటికి ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే రాష్ట్రంలో కోవిడ్ కట్టడి కోసం పగటి పూట కర్ఫ్యూని పటిష్టంగా అమలు చేస్తున్నప్రభుత్వం.. కరోనా పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటుంది. అలానే మహమ్మారి కట్టడి కోసం రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగతున్న సంగతి తెలిసిందే.
ఇక రాష్ట్రంలో కరోనాను నివారించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కట్టడి చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా ప్రతి రోజూ రాష్ట్రంలోని ఐదు వేలకు పైగా గ్రామాల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తోంది. రాత్రి వేళల్లోనూ ప్రతి రోజూ రెండు వేలకు పైగా గ్రామాల్లో ఫాగింగ్ (పొగ) చేస్తోంది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 5,916 గ్రామాల్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయగా.. ఆదివారం 5,881 గ్రామాల్లో.. శనివారం 5,838 గ్రామాల్లో పిచికారీ చేశారు.
సోమవారం రాత్రి సమయంలో 2,380 గ్రామాల్లో ఫాగింగ్ చేయగా.. ఆదివారం 2,296 గ్రామాల్లో, శనివారం 2,435 గ్రామాల్లో ఫాగింగ్ చేశారు. దేశమంతటా, రాష్ట్రంలోనూ కరోనా తీవ్రత పెరిగిన నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం గ్రామాల్లో 16 రకాల కరోనా కట్టడి చర్యలు చేపడుతుంది.