Rains (Credits: Pixabay)

Vjy, August 8: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ, తమిళనాడు పరిసరాలపై ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాలపై విస్తరించి ఉన్న మరో ద్రోణి వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.

అల్పపీడనం ఏర్పడినా దాని ప్రభావం ఒడిశాపైనే ఎక్కువగా ఉండే అవకాశం ఉందిని తెలిపింది. అయితే రాయలసీమపై ఉన్న ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పార్వతీపురం మన్యం, కర్నూలు, నంద్యాల తదితర జిల్లాల్లో ఎడతెగని వర్షాలు కురిశాయి.  రెయిన్ అలర్ట్, తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ

ప్రకాశం బ్యారేజ్‌కు వరద నీరు కొనసాగుతోంది. 70 గేట్లు ఎత్తి దిగవకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.67 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కృష్ణానదీ పరీవాహక ప్రాంత,లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. పంట్లు, నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దని.. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని పేర్కొంది. అత్యవసర సహాయం కోసం 1070,112, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లకు డయల్ చేయాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

నేడు కుక్కనూరు, వేలేరుపాడు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. గుండేటి వాగు ఉధృతితో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్ట్‌ వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. స్పిల్‌వే ఎగువ నీటిమట్టం 31.315, దిగువ నీటిమట్టం 22.47 మీటర్లు. 48 గేట్ల ద్వారా 7,20,875 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.  వీడియో ఇదిగో, ప్రకాశం బ్యారేజ్‌ 70 గేట్లు ఎత్తివేత, కృష్ణానదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు, పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

చింతలపూడి మండలం నాగిరెడ్డి గూడెం తమ్మిలేరు రిజర్వాయర్‌లోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 355 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం తమ్మిలేరు బేసిన్ 349.49 అడుగులుగా కొనసాగుతోంది. గోనెల వాగు బేసిన్ 349.23 అడుగులు కాగా, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు.. ప్రస్తుత నీటి నిల్వ 2.014 టీఎంసీలు. కాచ్ మెంట్ ఏరియాలో ఎగువ నుంచి వరదనీరు చేరుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తమ్మిలేరు ప్రవాహ ప్రాంతంలో గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకూ తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో 9.7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా చేబ్రోలులో 9.3 సెంటీమీటర్లు, నంద్యాల జిల్లా డోన్‌లో 8.8, శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో 8.4, చిత్తూరు జిల్లా వెంకటగిరి కోటలో 8.3 సెంటీమీటర్లు, విజయవాడలో 7.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.