Amaravati, June 27: సోమవారం శ్రీకాకుళం జిల్లా కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన అమ్మఒడి మూడవ విడత నిధుల ( YS Jagan disburses Jagananna Amma Vodi) విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చదువే నిజమైన ఆస్తి (Education is the only asset) అని సీఎం జగన్ స్పష్టం చేశారు. మనిషి తలరాతను మార్చగలిగే శక్తి చదువుకు మాత్రమే ఉందని, చదువుపై పెట్టే ప్రతి రూపాయి కూడా పిల్లల తలరాతలు మారుస్తుందని సీఎం జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. చదువులు ఎక్కువగా ఉండే దేశాల్లో ఆదాయం ఎక్కువగా ఉందన్నారు సీఎం జ.గన్. అమ్మఒడి మూడో విడతలో (Jagananna Amma Vodi) రూ. 6,595 కోట్లు జమ చేస్తున్నట్లు తెలిపారు. సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి తల్లి కష్టాన్ని చూశానని, అందుకే అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్నారు.
చదువుల మీద పెట్టే ప్రతిపైసా.. పవిత్రమైన పెట్టుబడి అని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులతో పిల్లలను చదివించలేని పరిస్థితి శాపం కాకూడదని కోరుకున్న ఆయన.. పిల్లలను బాగా చదివించినప్పుడే వాళ్ల జీవితాలు మారుతాయని చెప్పారు. సభా ప్రాంగణం నుంచి సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘చెరగని చిరునవ్వుతో అప్యాయత చూపిస్తున్న అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. అక్షరాల 43 లక్షల 96 వేల మందికి పైగా తల్లులకు, తద్వారా దాదాపుగా 80 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరనుంది. అక్షరాల 6, 595 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాలో నేరుగా జమ చేసే గొప్ప కార్యక్రమం ఇద’’ని తెలిపారు. అక్కచెల్లెమ్మలకు ఒక మంచి అన్నయ్య వాళ్లకు తోడుగా ఉన్నానని తెలియజేసే ఈ కార్యక్రమం.. దేవుడి దయ వల్ల ముందుకు సాగుతోందని చెప్పారాయన.
మనిషికి చదువే నిజమైన ఆస్తి అని పేర్కొన్న సీఎం జగన్.. చదువులు ఎక్కువగా ఉండే దేశాల్లో ఆదాయమూ ఎక్కువగా ఉందని గుర్తు చేశారు. నాణ్యమైన చదువులు మన రాష్ట్రంలో ప్రతీ ఇంట్లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఏపీలో గత మూడేళ్లుగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్న సీఎం జగన్.. మనిషి తలరాతను మార్చేసే శక్తి చదువుకు ఉందని తెలిపారు. సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి తల్లి కష్టాన్ని చూశానని.. అందుకే అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నానని ఆయన చెప్పారు. పిల్లలను బడికి పంపిస్తే చాలూ.. ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం తమ ప్రభుత్వం అందిస్తుందని.. పిల్లలు బడికి వెళ్తేనే చదువు వస్తుందని, వాళ్ల భవిష్యత్తు బాగుండాలనే 75 శాతం హాజరు నిబంధన తీసుకొచ్చామని తెలిపారు. ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే తన లక్ష్యమని మరోసారి ఉద్ఘాటించారు సీఎం జగన్.