Vijayawada, JAN 03: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ జారీ (GO's in Telugu) చేయాలని నిర్ణయించింది. ఆంగ్లం, తెలుగు.. రెండు భాషల్లోనూ ఉత్తర్వులు ఇవ్వాలని ఈ మేరకు వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మొదట ఇంగ్లీష్‌లో ఉత్తర్వులు ఇచ్చి అప్‌లోడ్ చేయాలని.. రెండు రోజుల్లోగా తెలుగులోనూ అవే ఉత్తర్వుల జారీకి చర్యలు తీసుకోవాలని వివిధ శాఖలకు సాధారణ పరిపాలన శాఖ సూచించింది. ఉత్తర్వుల అనువాదానికి డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్‌లేషన్ సేవలు వినియోగించుకోవాలని తెలిపింది. ఈ మేరకు జీఏడీ (GAD) ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
పాలనా వ్యవహారాలు, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే జారీ చేసేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవల విజయవాడలో నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభ తీర్మానించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కవులు, రచయితలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.