Amarawathi, SEP 11: ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వైఎస్ఆర్ కల్యాణమస్తు పథకంపై (YSR Kalyanamasthu) ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ (Bosta satyanarayana). జగన్ సర్కార్ కొత్తగా వైఎస్ఆర్ కల్యాణమస్తు పథకం అమలుకు శ్రీకారం చుట్టిందని, ఈ పథకం ద్వారా గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే రెట్టింపు సాయాన్ని సీఎం జగన్ ఇస్తున్నారని మంత్రి బొత్స చెప్పారు. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కచ్చితంగా పదో తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన పెట్టామన్నారు. నిరక్ష్యరాస్యతను రూపుమాపే చర్యల్లో భాగంగానే ఈ నిబంధన పెట్టామని మంత్రి బొత్స వివరించారు. పేదలకు సాయం చేసే కల్యాణమస్తు పథకంపై దుష్ప్రచారం చేయడం దారుణం అన్నారు.
వైఎస్ఆర్ కళ్యాణమస్తు (YSR Kalyanamasthu), షాదీ తోఫా పేరుతో ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం తీసుకొచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మికుల కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. పేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహానికి ఈ పథకం ద్వారా ఆర్థికసాయం చేయనున్నారు. కళ్యాణమస్తు, షాదీ తోఫాల కింద టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన దానికంటే అధికంగా నగదు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వైసీపీ (YCP) ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ ప్రకారం ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సీఎం జగన్ ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేసినట్లు అవుతుందన్నారు.
వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకం కింద అందించే సాయం
ఎస్సీ, ఎస్టీలకు రూ. 1 లక్ష
ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలకు రూ.ఒక లక్ష 20వేలు
బీసీలకు రూ. 50 వేలు
బీసీ కులాంతర వివాహాలకు రూ.75 వేలు
మైనార్టీలకు రూ. 1 లక్ష
వికలాంగుల వివాహాలకు రూ.1,50,000
భవన నిర్మాణ కార్మికులకు రూ.40 వేలు
అక్టోబర్ 1 నుంచి అమలు కానున్న పథకం
ఈ పథకం పొందేందుకు అమ్మాయి వయస్సు 18, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాల నిబంధన విధించింది రాష్ట్ర ప్రభుత్వం. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం.