Amaravati, June 22: గుంటూరు జిల్లాలో యువతి అత్యాచారం కేసులో (Guntur Rape Case) పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనకు సంబంధించి అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ఇప్పటికే పోలీసులు చాలా మందిని విచారించారని, నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. బాధితురాలి స్టేట్‌మెంట్ కూడా రికార్డు చేస్తామని, దర్యాప్తు అనంతరం నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామని ఆమె పేర్కొన్నారు.
కాగా గుంటూరు జిల్లా తాడేపల్లి రూరల్ మండలం సీతానగరం పుష్కర ఘాట్ సమీపంలో శనివారం రాత్రి(జూన్ 19) నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన విషయం విదితమే. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. అత్యాచార ఘటన తన మనసును కలచివేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS jagan) ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో ఎక్కడా జరగకూడదన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను (AP DGP Sawang) ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని ఘటనపై ఆరా తీశారు. నిందితులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించకూడదని.. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు.
మరోవైపు బాధితురాలిని పరామర్శించి ప్రభుత్వం తరఫున భరోసా ఇవ్వాలని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరితను, స్త్రీ శిశు సంక్షేమ శాఖ తానేటి వనితను ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు బాధితురాలికి ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయల పరిహారం అందజేస్తున్నట్లు ఏపీ మంత్రులు సుచరిత, తానేటి వనిత ప్రకటించారు.
తాడేపల్లి పరిధిలోని సీతానగరంలో జరిగిన ప్రేమికులపై దాడి ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఈ దాడి అత్యంత హేయం, బాధాకరం అన్నారు. బాధ్యులైన నిందితులను పట్టుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఇప్పటికే కృష్ణ, గుంటూరు జిల్లా ఎస్పీలు, విజయవాడ కమిషనర్‌లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇటువంటి అమానవీయ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. నేరానికి పాల్పడిన నిందితులు ఎంతటివారైనా ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలిపారు గౌతమ్ సవాంగ్. మహిళల భద్రత మా ప్రథమ కర్తవ్యం. ఎన్నో చర్యలు చేపట్టినా, ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరం అన్నారు. ప్రతి మహిళ దిశ యాప్‌ను ఖచ్చితంగా వాడాలని గౌతమ్ సవాంగ్ సూచించారు.