Cheyyeru River Tragedy: వైఎస్సార్‌ జిల్లాలో తీవ్ర విషాదం, చెయ్యేరు నదిలో 15 మంది గల్లంతు, మూడు మృతదేహాలు వెలికితీత, చిత్రావతి నదిలో చిక్కుకున్న 10 మంది, కొనసాగుతున్న సహాయక చర్యలు
Representtaional Image (Photo Credits: Pixabay)

YSR Kadapa, Nov 19: భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఎడతెరపిలేని వర్షం కారణంగా పలు జిల్లాలోని నదులు పొంగి పోర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెయ్యేరు నదిలో 15 మంది (Cheyyeru River Tragedy) గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా చెయ్యేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం పదిహేను మంది నదిలో (Cheyyeru River ) గల్లంతయ్యారు.

రాజంపేట సమీపంలోని అన్నమయ్య జలాశయం(Annamayya Reservoir) మట్టికట్ట కొట్టుకుపోయింది. దీంతో పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. పలు గ్రామాలు నీటమునిగాయి. అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ఎగువ ప్రాంతాల నుంచి చెయ్యేరు నది(Cheyyeru River)కి వరద నీరు పోటెత్తుతుంది. దీంతో నందలూరు, రాజంపేట తదితర ప్రాంతాల్లోకి  భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. చెయ్యేరు పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.

నందలూరు పరివాహక ప్రాంతంలోని మండపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతంలో సుమారు 15 మంది చెయ్యేరు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు నందలూరు(Nandaluru) వద్ద మూడు మృతదేహాలను వెలికితీశారు. స్థానికులు మాత్రం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

అలానే అనంతపురం చిత్రావతి నదిలో 10 మంది చిక్కుకున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా చిత్రావతి నదికి వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో ఓ కారు నది దాటుతుండగా మధ్యలో చిక్కుకుంది. కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే పైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని జేసీబీతో కారులో ఉన్నవారిని కాపాడేందుకు యత్నిస్తున్నారు. చెన్నై కొత్తపల్లి మండలం వెల్దుర్తి గ్రామ సమీపంలో నది దాటుతుండగా నీటి ఉధృతికి కారు కొట్టుకుపోయింది. కాగా నీటి ప్రవాహం అధికం కావడంతో జేసీబీ మధ్యలోనే ఆగిపోయింది. చిత్రావతి నది వద్దకు పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు.

వరద సహాయక చర్యలపై వర్యవేక్షణకు మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులు, ఐదు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

చిత్తూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు 540 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 700 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 1,300 గ్రామాల్లో అంథకారం అలుముకుంది. 170 చెరువులకు గండ్లు పడ్డాయి. బంగారుపాలెం మండలం, టేకుమందకు వెళ్లే దారి బలిజపల్లి వద్ద వాగులో కొట్టుకుపోయిన నలుగురు మహిళల ఆచూకీ ఇంతవరకు లభించలేదు.