AP High Court on Children: పిల్లల్ని అత్తమామల దగ్గర నుంచి తండ్రి తీసుకువెళితే కిడ్నాప్ కిందకు రాదు, తండ్రి వారికి చట్టబద్ధ సంరక్షకుడని తెలిపిన ఏపీ హైకోర్టు
Credits: Wikimedia Commons

Amaravati, May 25: పిల్లలను అత్తమామల నుంచి తీసుకువెళ్లిన కేసులో తండ్రికి ఏపీ హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అత్తమామల నుంచి పిల్లల్ని తండ్రి తీసుకెళ్లడం కిడ్నాప్‌ కాదని తీర్పు ఇచ్చింది. సున్నీ మహ్మదీయ చట్టం ప్రకారం పిల్లలకు తండ్రి చట్టబద్ధ సంరక్షకుడని గుర్తుచేసింది. పిల్లలపై తల్లి హక్కు అపరిమితమైనది కాదని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

కాగా తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్న పిల్లలను భర్త, మరొకరితో కలిసి కిడ్నాప్‌ చేశారని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అనంతపురం జిల్లా గుత్తి పోలీసులు 2022 సెప్టెంబరు 24న కేసు నమోదు చేశారు. ఆ కేసును కొట్టేయాలంటూ పిల్లల తండ్రి, మరొకరు హైకోర్టును ఆశ్రయించారు. వారి తరఫు న్యాయవాది వరుణ్‌ బైరెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్లపై నమోదు చేసిన కిడ్నాప్‌ కేసు చెల్లుబాటు కాదన్నారు.

వివేకా హత్య కేసు, తెలంగాణ హైకోర్టులో ఈ నెల 25న విచారణకు ఎంపీ అవినాష్‌ రెడ్డి పిటిషన్‌, విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పు

సున్నీ మహ్మదీయ లా ప్రకారం కుమారుడికి ఏడు, షియా మహ్మదీయ లా ప్రకారం రెండేళ్లు వచ్చేంత వరకు మాత్రమే తల్లి సంరక్షణలో ఉంచుకోగలదన్నారు. సున్నీ మహ్మదీయ చట్ట ప్రకారం మైనర్లకు తండ్రి సహజ, ప్రాథమిక సంరక్షకుడని పిటిషన్ తరపు లాయర్లు పేర్కొన్నారు. పిల్లలను తీసుకెళ్లిన సమయంలో ఒకరికి 8, మరొకరికి 10 ఏళ్లు ఉన్నాయని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. మహ్మదీయ చట్ట నిబంధనల ప్రకారం కొంత వయసు వరకే పిల్లలకు తల్లి సంరక్షకురాలిగా ఉంటారన్నారు.

నిర్ధిష్టమైన వయసు మించిన పిల్లలకు తండ్రి సహజ, చట్టబద్ధ సంరక్షకుడవుతారని స్పష్టం చేశారు. చట్టబద్ధ సంరక్షకుడు పిల్లల్ని తీసుకెళ్లడం కిడ్నాప్‌గా పరిగణించలేమని స్పష్టం చేశారు. పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేశారు.