
Vijayawada, SEP 21: బెజవాడలో భారీ వర్షం (Rain in Vijayawada) పడింది. కుండపోత వాన దంచికొట్టింది. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి వర్షం కురిసింది. భారీ వానతో ఒక్కసారిగా బెజవాడలో వెదర్ (Bejawada Weather) మారిపోయింది. వాతావరణం చల్లబడింది. కొన్నాళ్లుగా వాతావరణం ఎండాకాలాన్ని తలపించింది. మండుటెండలతో, తీవ్రమైన ఉక్కపోతతో జనం విలవిలలాడిపోయారు. సెకండ్ సమ్మర్ లా పరిస్థితి తయారైంది. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. ఎండల తీవ్రతతో జనం తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఇవేం ఎండలు రా నాయనా అని బెంబేలెత్తిపోయారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఒక్కసారిగా కురిసిన భారీ వానతో వాతావరణం మారిపోయింది. వాతావరణం చల్లగా మారడంతో నగరవాసులు ఊపిరిపీల్చుకున్నారు.
నిజానికి వేసవి కాలం ఎప్పుడో అయిపోయింది. వర్షాకాలం వచ్చినా.. వానలు మాత్రం సమృద్ధిగా కురవలేదు. చాలా ప్రాంతాల్లో ఇంకా ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు లేనిదే జనాలు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. తీవ్రమైన ఉక్కపోతతో విలవిలలాడిపోతున్నారు. వరుణుడు ముఖం చాటేయంతో సూర్యుడు విజృంభించాడు. భారీ ఎండలతో జనాలు పరేషాన్ అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడక్కడ వానలు కురిసి వాతావరణం చల్లబడటంతో ప్రజలు కాస్త రిలాక్స్ అవుతున్నారు. కాగా, వాతావరణంలో ఈ అనూహ్య మార్పులు, మండిపోతున్న ఎండలతో సర్వత్రా ఆందోళన నెలకొంది.