Vjy, August 25: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఝార్ఖండ్ పరిసర ప్రాంతాలపై ఇప్పటికే అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
అల్పపీడన ప్రభావం వల్ల కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండి తెలిపింది. సముద్ర తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈ క్రమంలో అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, కర్నూలు, విజయనగరం, బాపట్ల జిల్లాలకు ఐఎండి ఎల్లో అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది. నిండుకుండలా మారిన నాగార్జున సాగర్ డ్యామ్, గేట్ల పై నుంచి పారుతున్న వరద, అద్భుత దృశ్యం ఆవిష్కృతం (వీడియో ఇదుగోండి)
కాగా, అంతర్వేది నుంచి పెరుమల్లపురం, కష్ణా తీరంలో నాచుగుంట నుంచి పెద్ద గొల్లపాలెం వరకు అతివేగంగా అలలు వస్తాయని వాతావరణ శాఖా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే, నెల్లూరు తీరంలో కోరమాండల్ నుంచి వట్టూరుపాలెం వరకు పశ్చిమ గోదావరి తీర ప్రాంతం అంతటా అతివేగంతో అలలు వస్తాయని ఐఎండి పేర్కొంది. ఈ క్రమంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ అధికారులు సూచనలు చేశారు.
రాజోలు దీవిలో రెండు రోజులగా కురుస్తున్న కుండపోత వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రాజోలు నియోజకవర్గ కేంద్రమైన పోలీస్ సర్కిల్ ఆఫీస్, ట్రెజరీ ఆఫీస్, తహసీల్దార్, ఫైర్ స్టేషన్ ఆఫీసులలో నీరు చేరడంతో సిబ్బందికి తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. అటు బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడి మరోక 24 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.