Vjy, July 9: విజయవాడ కేంద్రంగా మరోసారి కిడ్నీ రాకెట్ ముఠా మోసం వెలుగులోకి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో కిడ్నీ విక్రయానికి అంగీకరిస్తే.. కిడ్నీ తీసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకుండా తనను మోసం చేశారని గుంటూరు జిల్లా కొండా వెంకటప్పటయ్యకాలనీకి చెందిన బాధితుడు మధుబాబు వాపోయారు.ఈ మేరకు సోమవారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
మీడియాతో బాధితుడు మాట్లాడుతూ.. కొవిడ్ సమయంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా అప్పులు చేశాను. అదే సమయంలో ఫేస్‌బుక్‌లో బాషా అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కిడ్నీ ఇస్తే డబ్బులు వస్తాయని చెప్పాడు.బాషా ద్వారా మధ్యవర్తి వెంకట్‌తో మాట్లాడాను. తన వద్ద రోగి ఉన్నాడు.. అతనికి కిడ్నీ ఇస్తే రూ.30 లక్షలు ఇప్పిస్తానని నమ్మించాడు. చివరికి రోగి బావ సుబ్రహ్మణ్యాన్ని నాకు పరిచయం చేశారు. విజయవాడలోని ఓ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అన్నీ రోగికి సరిపోయేలా ఉండటంతో తొలుత రూ.59 వేలు ఇచ్చారు’ అని మధుబాబు వెల్లడించారు. రూ. 30 లక్షలు ఇస్తామని ఆశచూపి కిడ్నీ కొట్టేసిన ముఠా.. చివరకు రూ. లక్ష చేతిలో పెట్టి బెదిరింపులు.. విజయవాడలో భారీ మోసం
కిడ్నీ ఇవ్వాలంటే సమీప బంధువుగా ఉండాలని నా ఆధార్‌కార్డును వారికి అనుకూలంగా మార్పించారు. నాకు తల్లిదండ్రులు లేకపోవడంతో ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం నకిలీ పత్రాలు సృష్టించారు. ఎడమవైపు కిడ్నీ తీసుకుంటామని చెప్పి గత నెల 15న శస్త్రచికిత్స చేశారు. స్పృహ వచ్చిన తర్వాత చూస్తే కుడివైపు ఉన్న కిడ్నీని వెంకటస్వామి అనే వ్యక్తికి మార్పిడి చేశారు. ఒప్పందం ప్రకారం రూ.30 లక్షలు కాకుండా.. రూ.50 వేలు మాత్రమే ఇచ్చారు. ఇదేంటని రోగి బంధువు సుబ్రహ్మణ్యం, మధ్యవర్తి వెంకట్, వైద్యుడు శరత్‌బాబును అడిగితే నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. కిడ్నీ తీసినవాళ్లం.. ప్రాణాలు తీయడం లెక్క కాదు అని బెదిరించారు’ అని మధుబాబు చెప్పారు.
Here's Video
Trapped by loan apps, 31-yr-old autodriver from Guntur donated kidney thru agent who told him about ad on Faceook & promised Rs 30 lakh for a kidney; fake documents were created, surgery happened at Vijaya Super Speciality Hosp in Vijayawada but 7 months later he got only Rs 50k pic.twitter.com/Kx0jVir9RJ
— Uma Sudhir (@umasudhir) July 8, 2024
ఈ ఘటనపై కిడ్నీ మార్పిడి చేసిన ఆస్పత్రి యాజమాన్యం మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూనే మూత్రపిండాల మార్పిడి చికిత్స నిర్వహించామని శరత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ అధినేత డాక్టర్ జి.శరత్‌బాబు వెల్లడించారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం కంచడం గ్రామానికి చెందిన కేతినేని వెంకటస్వామికి గత నెలలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశాం. వెంకటస్వామి కుటుంబ మిత్రుడైన మధుబాబు మూత్రపిండం దానం చేశారు. కిడ్నీ విక్రయాలపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదు’ అని శరత్‌బాబు పేర్కొన్నారు.