Amaravati, Mar 23: ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్నికలను (AP MPTC and ZPTC Elections) నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు (Andhra Pradesh High Court) ఈరోజు విచారించింది. పరిషత్ ఎన్నికలను నిర్వహించాలంటూ ఎన్నికల సంఘాన్ని ఆదేశించలేమని స్పష్టం చేసింది. ఈ అంశంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. మరోవైపు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీ, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా (adjourns next hearing to March 30) వేసింది.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. ముఖ్యంగా పరిషత్ ఎన్నికల నిర్వహణకు ఆదేశించాలంటూ కొందరు వేసిన పిటిషన్లపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమంటూ దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. కాగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు (MPTC and ZPTC Elections) సంబంధించిన అంశం తమ వద్ద ఉందని, దానికి సంబంధించి ఆలోచన ముందుకు వెళుతోందని ఎస్ఈసీ తెలిపింది.
దీంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటుందని, కమిషనరే తేదీలను ఖరారు చేయాల్సి ఉంటుందని, నిర్వహించాలని తాము ఆదేశించలేమని, దీనికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఈ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరులో ఎస్ఈసీగా నిమ్మగడ్డ పదవీ విరమణ చేస్తున్నారు. ఎన్నికలను నిర్వహించి వెళ్లిపోవాలని ఎస్ఈసీని వైసీపీ కోరుతోంది. వెంటనే ఎన్నికలను పూర్తి చేస్తే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి స్థాయిలో చేపడతామని నిమ్మగడ్డను కలిసి చీఫ్ సెక్రటరీ విన్నవించారు.
మరోవైపు తమ ముందు హాజరు కావాలంటూ ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ కూడా నిమ్మగడ్డకు నోటీసులు పంపింది. ఈ నోటీసులకు ఆయన సమాధానమిస్తూ... తాను కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నానని... ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఇప్పటికిప్పుడే రాలేనని తెలిపారు.