Amaravati, July 31: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో (Chandrababu) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Dy CM Pawan Kalyan) అమరావతిలో సమావేశమయ్యారు. నామినేటెడ్ పదవులతో పాటు ఇతర కీలక అంశాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. నామినేటెడ్ పోస్టుల కేటాయింపుపై ఈ భేటీలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కష్టపడిన వారందరినీ గుర్తించి సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు ఇప్పటికే పలు సందర్భాల్లో తెలిపారు. టీడీపీ (TDP) విషయానికి వస్తే తమ పార్టీలో కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి ఇప్పటికే టీడీపీ కసరత్తులు పూర్తి చేసింది.
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైసీపీ (YRSCP) నుంచి వచ్చిన ఒత్తిళ్లను తట్టుకుని ఎవరు పనిచేశారన్న వివరాలపై ఆరా తీసింది. అలాగే, దాడులకు గురైన వారి వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఏయే శాఖల్లో ఏయే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయన్న వివరాలను తీసుకుంది.
నామినేటెడ్ పదవుల భర్తీపై టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య అవగాహన కుదిరింది. కూటమి అధికారంలోకి వచ్చి 45 రోజులు గడిచినా నామినేటెడ్ పోస్టులపై తుది నిర్ణయం తీసుకోలేదు. మూడు పార్టీల మధ్య పదవుల పంపకంపైన ఫార్ములా తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది.