Ramachandraiah And Hariprasad (PIC@ Twitter)

Vijayawada, July 05: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల అభ్యర్థులు (MLCs) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ తరుఫున, మాజీ మంత్రి రామచంద్రయ్య (Ramachandraiah), జనసేన తరుఫున హరిప్రసాద్‌ (Hari prasad) మంగళవారం నామినేషన్లు వేశారు. పోటీగా నామినేషన్లు రాకపోవడంతో వారు ఏకగ్రీవంగా(Unanimously) ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శుక్రవారం ప్రకటించారు.సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్న సి. రామచంద్రయ్య, షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ వైసీపీకి (YSRCP) రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వీరిలో ఇక్బాల్‌ ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేయగా రామచంద్రయ్యపై అనర్హత వేటు పడింది. దీంతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 12న ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా రెండు పదవులు ఏకగ్రీవం కావడంతో ఎన్నికల నిర్వహణ తప్పింది.

 

కడప జిల్లా రాజంపేటకు చెందిన రామచంద్రయ్య టీడీపీ (TDP) హయాంలో మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2008లో టీడీపీకి రాజీనామా చేసి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరువాత కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రి పదవిని అప్పగించింది. అనంతరం 2018లో వైసీపీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

జనసేన (Janasena) అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు రాజకీయ కార్యదర్శిగా ఉన్న పి. హరిప్రసాద్‌ను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో 175 స్థానాలకు గాను టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన 164 మంది సభ్యులు గెలుపొందగా వైసీపీ కేవలం 11 మంది మాత్రమే విజయం సాధించారు.