Nellore, FEB 05: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy) వైసీపీని (YCP) మరోసారి టార్గెట్ చేశారు. గన్ మెన్ల తొలగింపుపై కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు గన్ మెన్లను (Gun mens) తొలగించారని.. మిగిలిన గన్ మెన్లు కూడా తనకు వద్దన్నారు. ప్రభుత్వానికి తాను రిటర్న్ ఇస్తానని చెప్పారు. గన్ మెన్లను తొలగించినంత (Scaling down security cover) మాత్రాన భయపడేదిలేదని తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి భద్రతను తగ్గించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు నలుగురు ఉన్న గన్ మెన్లను ఇద్దరికి కుదించింది. ఈ క్రమంలో మిగిలిన ఇద్దరు గన్ మెన్లను కూడా కోటంరెడ్డి వద్దన్నారు. ఆ ఇద్దరిని కూడా తిరిగి ప్రభుత్వానికే పంపుతున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వేదాయిపాలెం పోలీస్ స్టేషన్ లో కిడ్నాప్ కేసు నమోదైంది. తనను ఫోన్ లో బెదించడంతోపాటు తన ఇంటి దగ్గరికి వచ్చి కిడ్నాప్ కు యత్నించారని కోటంరెడ్డిపై కార్పొరేటర్ విద్యాభాస్కర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రౌడీలను పెట్టి చంపిస్తవా అని కోటంరెడ్డిని విద్యా భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బెదిరింపు కాల్ కూడా వచ్చింది. సీఎం జగన్ ను, పార్టీ పెద్దలను విమర్శిస్తే బండికి కట్టుకుని వెళ్తామని బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి కోటంరెడ్డిని బెదిరిస్తూ ఫోన్ చేశాడు. దీంతో కోటంరెడ్డి వైసీపీ నేతలకు అభిమానులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనపై కిడ్నాప్ కేసే కాదు మర్డర్ కేసు కూడా పెట్టుకోండి బట్ ఐడోంట్ కేర్ అంటూ కౌంటర్ ఇచ్చారు.
అంతేకాకుండా నన్ను బెదిరిస్తూ ఫోన్ కాల్స్ వస్తే మీకు వీడియో కాల్స్ వస్తాయి జాగ్రత్త అంటూ ఎదురు దాడికి దిగారు. కోటంరెడ్డి జగన్ కు నమ్మక ద్రోహం చేశారంటూ మంత్రి కాకాణి విమర్శలకు కోటంరెడ్డి కౌంటర్ ఇస్తూ..వైఎస్ కుటుంబ గురించి మాట్లాడే అర్హత కాకాణికి లేదన్నారు. జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు తాను మద్దతు ఇస్తే జగన్ వెంట వెళితే అంతే అంటూ కాకాణి అన్నారు అంటూ అసలు విషయం బయటపెట్టారు. జగన్ తో నడిస్తే భవిష్యత్ ఉండదన్న కాకాణి.. జగన్ ఒంటరిగా ఉన్నప్పుడు లేని కాకాణి ఇప్పుడు మాత్రం జగనే దేవుడు అంటున్నారని, మంత్రి పదవి ఇచ్చినందుకు ఆమాత్రం భజన చేయాల్సిందేనంటూ ఎద్దేవా చేశారు. ఆనంను మోసం చేసింది కాకాణి కాదా? అంటూ కోటంరెడ్డి ప్రశ్నించారు.