Vijayawada, April 13: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ (YSRCP) పార్టీకి మరో షాక్ తగిలింది. పీ గవన్నవం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు (Kondeti Chittibabu) పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన.. కాంగ్రెస్‌లో చేరారు. ముద్దనూరులో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో చిట్టిబాబు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన వెంటనే ఆయన పార్టీని మారారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పీ గన్నవరం (P Gannavaram MLA) నుంచి చిట్టిబాబు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు పార్టీ టికెట్‌ను నిరాకరించింది. చివరకు ప్రయత్నం చేసిన ఆయన ఫలితం లేకపోవడంతో పార్టీని వీడారు.
ఆయన స్థానంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విప్పర్తి వేణుగోపాల్‌కు టికెట్ ఇచ్చింది. దాంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న కొండేటి చిట్టిబాబు.. పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. నిన్నటి వరకు వేచిచూసే ధోరణిలో ఉన్న ఆయన.. చివరకు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 175 అసెంబ్లీ స్థానాలకుగాను ఇప్పటి వరకు 126 మంది అభ్యర్థులను ప్రకటించింది. మిగతా స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేయనున్నది. పీ గన్నవరం సీటును ఎవరికీ కేటాయించలేదు. ప్రస్తుతం ఖాళీగా ఉండడంతో చిట్టిబాబు కాంగ్రెస్‌లో చేరడంతో ఆయనకే టికెట్ వచ్చే అవకాశం ఉన్నది.