Amaravati, April 11: ఆంధ్రప్రదేశ్ విభజన కేసు విచారణను (AP Partition Case) వచ్చే మంగళవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, తెలంగాణ వికాస కేంద్ర తదితరులు దాఖలు చేసిన ఈ పిటిషన్లు నేడు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నల ధర్మాసనం ముందుకొచ్చింది.
కాగా మధ్యాహ్నా భోజన విరామ సమయానికి ముందు ఏపీ తరఫు అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ మెహ్‌ఫూజ్ నజ్కీ ఈ పిటిషన్లు విచారించాలని సుప్రీం న్యాయమూర్తుల్ని కోరారు. అయితే ఇటీవలే రాజధాని కేసు విచారణ వాయిదా అంశాన్ని గుర్తు చేసిన జస్టిస్ కేఎం జోసెఫ్.. ఈ పిటిషన్లు కూడా దానికి సంబంధించినవేనా అని ఆరా తీశారు. రెండు అంశాలకు సంబంధం లేదని వేర్వేరు పిటిషన్లుగా ఇప్పటికే వేరు చేసి జాబితా చేశారని నజ్కీ వివరించారు.
భోజన విరామ అనంతరం కేసుల విచారణలో భాగంగా విచారిస్తామని న్యాయమూర్తులు తెలిపారు. సాయంత్రం కోర్టు సమయం ముగిసేనాటికి పిటిషన్లు బెంచ్ మీదకు రాకపోవడంతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో ఈ పిటిషన్లు వచ్చే మంగళవారం విచారిస్తామని, ఆ మేరకు విచారణ జాబితాలో చేర్చాలని జస్టిస్ కేఎం జోసెఫ్ రిజిస్ట్రీని ఆదేశించారు.