Tirupati, April 15: తిరుమల మొదటి ఘాట్ రోడ్ (Tirumala Ghat) లో ఏనుగులు (Elephants) హల్ చల్ చేశాయి. ఏడో మైలు వద్ద ఏనుగుల గుంపు తిష్ట వేసింది. గుంపులో ఐదు మదపటేనుగులు (Elephants at Tirumala Ghat), ఒక గున్న ఏనుగు ఉన్నాయి. దీంతో ఘాట్ రోడ్ లో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. అవి ఎక్కడ తమపై దాడి చేస్తాయోనని కంగారు పడుతున్నారు. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు ఏనుగులను తిరిగి అడవిలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.తిరుమల ఘాట్ రోడ్ 7వ మైలు వద్ద అంటే ఆంజనేయ స్వామి విగ్రహానికి అత్యంత సమీపంలో శనివారం సాయంత్రం ఏనుగుల సంచారాన్ని భక్తులు గుర్తించారు. రోడ్డుకు పక్కనే ఈ ఏనుగులు సంచరిస్తుండటంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు.
కాగా, ఈ ప్రాంతంలో ఇటీవలి కాలంలో తరుచుగా ఏనుగులు రావడం జరిగింది. ఐదారుసార్లు ఏనుగులు వచ్చాయి. రోడ్డు మీదకు కూడా ఏనుగులు వచ్చిన పరిస్థితి ఉంది. అక్కడున్న వెదురు పొదలను ధ్వంసం చేయడం, తినడము ఆ తర్వాత వెళ్లిపోవడం గతంలోనూ జరిగింది.
అదే విధంగా శనివారం సాయంత్రం కూడా ఏనుగులు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న భక్తులు, స్థానికులు ఏనుగులను చూశారు. వెంటనే వాటిని తమ ఫోన్లలో వీడియో తీశారు. ఏనుగులు ఎక్కడ తమపై దాడికి దిగుతాయోనని భక్తులు, స్థానికులు కాస్త భయాందోళనకు గురయ్యారు.