Tirupati, Sep 20: దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం చర్చనీయాంశమైంది. ఏఆర్ డెయిరీ టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు తేలిందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ఈవో శ్యామలరావు తెలిపారు. శుక్రవారం(సెప్టెంబర్20) తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేవంలో ఈవో మాట్లాడారు. కల్తీ జరిగినట్లు తేలడంతో లడ్డూ తయారీలో ఏఆర్ డెయిరీ నెయ్యి వాడడం ఆపేశామని చెప్పారు.
లడ్డూ తయారీకి ఏఆర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. టీటీడీకి సొంత టెస్ట్ ల్యాబ్ లేదు. జులై5,6 తేదీల్లో రెండు నెయ్యి ట్యాంకర్లలోని శాంపిల్స్‌ను బయట ల్యాబ్‌లలో టెస్ట్‌కు పంపాం. ఏఆర్ డెయిరీ నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఈ టెస్ట్‌లలో తేలింది. దీంతో సరఫరాదారులందరికీ వార్నింగ్ ఇచ్చాం. నెయ్యి సరఫరా కోసం కొత్త కాంట్రాక్టర్‌తో టెండర్ ఖరారైంది’అని ఈవో తెలిపారు.
మా నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదు, తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏఆర్ డెయిరీ వివరణ
ఈ వివాదంపై తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిని అందించే తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ సంస్థ స్పందించింది.ఏఆర్ డెయిరీ నుండి జూన్, జూలైలో నెయ్యి సరఫరా చేశాం. ఇప్పుడు మా సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చెయ్యడం లేదు. 25 సంవత్సరాలుగా మేం డైయిరీ సేవల్ని అందిస్తున్నాం. దేశ వ్యాప్తంగా మా ఉత్పత్తుల అమ్మకాలు నిర్వహిస్తున్నాం. ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు రాలేదు.
తాజాగా, మా సంస్థపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మేం.. టీటీడీకి అందించే నెయ్యి నాణ్యతా ప్రమాణాలపై టెస్ట్‌లు నిర్వహించాం. ఆ టెస్టుల్లో నేయ్యిలో ఎలాంటి లోపాలు లేవని తేలింది. కానీ మాపై విష ప్రచారం చేస్తున్నారు. టీటీడీ అడిగిన వెంటనే సంబంధిత రిపోర్ట్‌ను పంపించాం. కానీ టీటీడీ నుంచి మాకు స్పందన రాలేదు’’ అని ఏఆర్ డెయిరీ యాజమాన్యం తెలిపింది.