Vjy, Jan 2: న్యూఇయర్‌లో గోవా(Goa)లో తాడేపల్లిగూడెం(Tadepalligudem) యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఫుడ్ ఆర్డర్ విషయంలో టూరిస్ట్‌లకు గోవా బీచ్‌లోని ఓ రెస్టారెంట్ సిబ్బందికి వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో ఏపీకి చెందిన బొల్లా రవితేజ హత్యకు గురయ్యాడు. మృతుడు పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లికి చెందిన బొల్లా రవితేజగా గోవా పోలీసులు గుర్తించారు. ఈ దుర్ఘటనలో నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు గోవా డీఐజీ వర్షా శర్మ తెలిపారు.
కలంగుట్ బీచ్‌లో ఉన్న మరీనా బీచ్ శాక్ యజమాని అగ్నెల్ సిల్వేరా,అతడి కుమారుడు షుబర్ట్ సిల్వేరియాతో పాటు సిబ్బంది అనిల్ బిస్టా, సమల్ సునర్‌లను అరెస్ట్ చేసినట్లు డీఐజీ వెల్లడించారు. కాగా నిన్న రాత్రి ఒంటి గంటకు ఆ రెస్టారెంట్‌కు అర్థరాత్రి వచ్చిన రవితేజ, అతని స్నేహితుడు హైదరాబాద్‌కు చెందిన స్పందన్ బొల్లు ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. అయితే బీచ్ షాక్ రెస్టారెంట్ యజమాని సిల్వేరా.. రవితేజ, అతని స్నేహితుడి నుంచి ఉన్న ధర కంటే ఎక్కువ మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఉన్న బిల్లుపై ఎక్కువ మొత్తం ఇవ్వాలంటే సాధ్యం కాదని చెప్పే ప్రయత్నం చేశారు.
ఆ సమయంలో రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ఓ వ్యక్తి రవితేజపై దాడి చేశాడు. అలా ఫుడ్ ఆర్డర్ ఇవ్వడంలో చోటు చేసుకున్న వివాదం హింసాత్మకంగా మారింది. నిందితులు టూరిస్ట్ తేజపై వెదురు కర్రలతో తలపై మోదారు. ఆపై శరీర భాగాలపై దాడి చేశారు. తీవ్ర గాయాలతో, నిందితులు కొట్టిన దెబ్బలకు తాళలేక బాధితుడు తేజ మరణించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గోవాలో గత కొద్ది రోజుల్లో ముగ్గురు టూరిస్ట్‌లు మరణించారు. అంతకుముందు నవంబర్‌లో ఢిల్లీ టూరిస్ట్ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో మరణించాడు. క్రిస్మస్ రోజు మహరాష్ట్రకు చెందిన టూరిస్ట్ బోట్ బోల్తా పడి మరణించాడు.