Body Donation: మరణంలోనూ ఆదర్శం, 24 గంటల వ్యవధిలో వైద్య కళాశాలకు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి దేహదానం, భద్రాచలంకు చెందిన మరింగంటి కుటుంబంలో అరుదైన సంఘటన...
ప్రొఫెసర్ రాధాకృష్ణ, మరింగంటి అప్పలాచార్యులు (Image: Facebook)

విజయవాడ, జనవరి 23: వాళ్లిద్దరూ ఆచార్యులు... తమ వృత్తిలో నిబద్ధతతో రాణించి చివరి శ్వాస వరకూ అదే పనిలో కొనసాగారు. జీవితాంతం తమ మేధస్సును విద్యార్థులకు పాఠాలుగా మార్చి.. చెప్పిన ఇరువురు, మృత్యువులోనూ తమ శరీరాలను వైద్య విద్యార్థుల కోసం వదిలి తనువు చాలించారు. బ్రతికి ఉన్నప్పుడు మేధస్సును, చరమాంకంలో దేహాన్ని సైతం విద్యార్థులకు వదలడం అరుదైన విషయం. అది కూడా ఒకే కుటుంబానికి చెందిన వీరిద్దరూ కేవలం 24 గంటల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు ప్రపంచాన్ని వదిలి తమ శరీరాలను వైద్య కళాశాలకు అప్పగించారు.

ఆదర్శానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన బాబాయి, అబ్బాయి..

ఇక వివరాల్లోకి వెళితే భద్రాచలం వాస్తవ్యులైన మరింగంటి అప్పలాచార్య (102), ప్రొఫెసర్. మరింగంటి రాధాకృష్ణ (81) ఒకే కుటుంబానికి చెందినవారు. వరుసకు అప్పలాచార్య సోదరుడి కుమారుడే ప్రొఫెసర్ రాధాకృష్ణ. ఈ నెల 20న మరింగంటి అప్పలాచార్య ఉదయం సహజ మరణం పొందగా, ఆయన కోరిక మేరకు వారి కుటుంబ సభ్యులు అప్పలాచార్య మృతదేహాన్ని ఈ నెల 21న విజయవాడలోని సిద్ధార్థ వైద్యకళాశాలకు అప్పగించారు. అయితే యాదృచ్ఛికంగా మరింగంటి అప్పలాచార్య మృతదేహాన్ని వైద్య కళాశాలకు అప్పగించిన రోజే వారి సోదరుడి కుమారుడు ప్రొఫెసర్ రాధాకృష్ణ సైతం అదే సాయంత్రం కన్నుమూయడం విషాదం. దీర్ఘకాలికంగా గత 4 సంవత్సరాలుగా కాన్సర్ వ్యాధితో బాధపడిన రాధాకృష్ణ ఈ నెల 21న తనువు చాలించారు. కాగా ఆయన కోరిక మేరకు హైదరాబాద్ లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ అనాటమీ విభాగానికి భౌతిక కాయాన్ని వారి కుటుంబ సభ్యులు అందించారు.

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తుల భౌతిక కాయాలను వైద్య కళాశాలకు అందించడం, ముందు తరాలకు మార్గదర్శకం అవుతుందని ఈ సందర్భంగా వైద్యలోకం హర్షించింది. సిద్ధార్థ వైద్య కళాశాల ప్రొపెసర్ అండ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అనాటమి డాక్టర్ ఆశాలత మాట్లాడుతూ, మరణానంతరం తమ దేహాలను మెడికల్‌ కాలేజీకి దానం చేస్తే, ఆ శరీరాలను వైద్య విద్యార్థులకు బోధించడానికి, పరిశోధనలకు ఉపయోగించబడుతోందని, ఈ విషయంలో చొరవ తీసుకున్న కుటుంబ సభ్యులకు శ్లాఘించారు. అదే సందర్భంలో ఉస్మానియా మెడికల్ కాలేజ్ అనాటమీ ప్రొఫెసర్ డాక్టర్ బొజ్జా మహితి మాట్లాడుతూ తమ కళాశాలలో ప్రతీ సెమిస్టర్ లో 250 మంది వైద్య విద్యార్థులు విద్యను పొందుతున్నారని, వారికి దేహదానం ద్వారా పొందిన దేహాలు పరిశోధనలకు చాలా ఉపయోగపడతాయని తెలిపారు.

దేహదానం భవిష్యత్ వైద్య జగత్తుకు ప్రాణదానం...

ఇదిలా ఉంటే నేడు అనేక వైద్య పరిశోధనలు చేయడానికి, డాక్టర్లుగా తయారు కావడానికి ఉపయోగపడుతున్న 'దేహాలు' కూడా లేక అనేక మెడికల్‌ కాలేజీలు తీవ్ర ఆటంకాలను ఎదుర్కొంటున్నాయి. మరణానంతరం తమ దేహాలను మెడికల్‌ కాలేజీకి దానం చేస్తే, ఆ శరీరాలను వైద్య విద్యార్థులకు బోధించడానికి, పరిశోధనలకు ఉపయోగిస్తున్నారు. ఇది అనేక వ్యాధులకు గల కారణాలను కనుగొని వైద్య శాస్త్ర అభివద్ధికి ఎంతగానో ఉపయోగపడుతోంది. మనిషి చనిపోయాక కూడా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఇస్తుంది. మన దేశంలో అవయవ వైఫల్యం కారణంగా మరణించే వారి సంఖ్య భారీగానే ఉంది. అవయవ దానం ద్వారా అటువంటి వారికి రెండవ సారి ప్రాణం పోయవచ్చు.

సాధారణంగా బ్రెయిన్‌ డెత్‌ అయిన వ్యక్తి కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, పాంక్రియాస్‌, కండ్లు, చర్మం, ఎముకలు, వంటివి ఉపయోగపడే అవయవాలు. సహజంగా మరణించిన వ్యక్తిలో కూడా కండ్లు, గుండె వాల్వ్‌లు, చర్మం, ఎముకలు, కార్టిలాజ్‌, నరాల వంటి అవయవాలను కూడా దానం చేయవచ్చు. మార్చి 2020 నాటికి జాతీయ అవయవ మార్పిడి వెయిటింగ్‌ జాబితాలో పురుషులు, మహిళలు, పిల్లలు 1,12,000 పైగా ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి మనిషి అవయవాలు దానం చేయొచ్చు. క్యాన్సర్‌ పేషెంట్లు కూడా కార్నియాను దానం చేయవచ్చు. వందేండ్ల వయసు వరకు కార్నియాలు, చర్మం, 70ఏండ్ల వరకు కిడ్నీలు, కాలేయం, 50 ఏండ్ల వరకు గుండె, ఊపిరితిత్తులు వంటి అవయవాలు దానం చేయవచ్చు. మరణానంతరం కూడా సమాజంలో ఆదర్శంగా నిలవడానికి, మరికొంత మందికి కొత్త జీవితాన్ని ఇవ్వడానికి ఈ దానాలు ఎంతగానో తోడ్పడతాయి. వీటిని ప్రోత్సహించడం ఎంతో అవసరం.