
Amaravati, Jan 27: తూర్పు భూమధ్య రేఖా ప్రాంతానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో శుక్రవారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా మూడు రోజులపాటు నెమ్మదిగా పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (IMD) గురువారం రాత్రి నివేదికలో తెలిపింది.
ఈ ఉపరితల ఆవర్తన ఫలితంగా ఈ నెల 29, 30 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి (Low rain-forecast) నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని (Weather Forecast) వాతావరణ నిపుణులు చెబుతున్నారు.సాధారణంగా జనవరి మొదటి వారం తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనాలు అరుదుగా ఏర్పడుతుంటాయి. అంతకుముందే ఈశాన్య రుతుపవనాలు కూడా నిష్క్రమిస్తాయి. దీంతో వర్షాలకు ఆస్కారం ఉండదు. కానీ, ప్రస్తుతం సముద్రంపై తేమ అధికంగా ఉండడం వల్ల ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ఏర్పడడానికి దోహదపడుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
మరోవైపు చలి పులి కొనసాగుతోంది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతల క్షీణత కొనసాగుతూనే ఉంది. కొద్దిరోజుల నుంచి ఏజెన్సీ ఏరియాతోపాటు రాయలసీమలో రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు (ఏఎస్సార్), శ్రీకాకుళం, అనకాపల్లి, చిత్తూరు, కాకినాడ, అన్నమయ్య, పార్వతీపురం మన్యం, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా క్షీణిస్తున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే వణికిపోతున్నారు.
అక్కడ 4 నుంచి 12 డిగ్రీల వరకు రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. రాష్ట్రంలో గురువారం వేకువజామున అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 4.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమల్లో రానున్న రెండు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని ఐఎండీ తెలిపింది.