Vijayawada, July 24: భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో వరదలు (AP Floods) పోటెత్తాయి. పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి రూరల్ మండలంలోని నందమూర్‌ గ్రామంలో పర్యటించారు. గ్రామంలో నీట మునిగిన పంటపొలాలను చూసి ఆవేదన వ్యక్తంచేశారు. నడుము లోతు నీళ్లలో పొలాల్లోకి వెళ్లి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిస్థితి కేంద్రానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మోదీ సర్కారు (Modi Govt) తీరు చూస్తుంటే వాళ్లకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలో భాగం అన్న ఆలోచన లేనట్టుగా అనిపిస్తోందని విమర్శించారు. బీహార్‌, అసోం, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు వరదల నియంత్రణ, పునరావాసం పేరుతో బడ్జెట్‌లో అదనపు నిధులు కేటాయించారని, ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) ఎందుకు మొండిచేయి చూపారని ప్రశ్నించారు.

 

ఆంధ్రప్రదేశ్‌లో వరద దుస్థితి కేంద్రానికి కనిపించడం లేదా అని షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలోని పంట పొలాల్లో నడుములోతు నీరు నిలిచిందని, ఇది కేంద్ర దృష్టికి రావాలనే తాను నీళ్ల మధ్యకు వచ్చానని ఆమె చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారే ఉన్నా ఇక్కడి ప్రజలకు న్యాయం జరగకపోవడం విచారకరమని విమర్శించారు.