YSRCP Response on Rushikonda Palace

Vizag, June 16: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇవాళ విశాఖలోని రుషికొండపై (Ruhikonda) నిర్మాణాలను పరిశీలించిన విషయం తెలిసిందే. అక్కడ నిర్మించిన ప్యాలస్ (Rushikonda Palace) వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో దీనిపై వైఎస్సార్సీపీ (YSRCP) తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందించింది. అక్కడ ఉన్నవి ప్రభుత్వ భవనాలేనని తెలిపింది. అవి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులని పేర్కొంది. ప్రైవేటు ఆస్తులు కాదని తెలిపింది. అలాగే, అవి ఎవరి సొంతంకూడా కాదని చెప్పింది. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాటిని నిర్మించినట్లు తెలిపింది. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది సర్కారు ఇష్టమని పేర్కొంది.

 

అటువంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించారని, వాటికి వక్రీకరణలకు జోడించి బురదజల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చింది. 1995 నుంచి కూడా విశాఖపట్నం (Vizag) ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నారని తెలిపింది. ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు.

విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్లినా, గవర్నర్‌లాంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించాలని చెప్పింది. రుషికొండ రిసార్ట్స్‌ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడంవల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమోగాని, విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదని పేర్కొంది.