Krishna Water Row: తగ్గేదేలే.. కృష్ణా నీటి కోసం రాజీ లేని పోరుకు సిద్ధమని తెలంగాణ సీఎం కేసీఆర్ పునరుద్ఘాటన, అన్ని వేదికలపైనా, పార్లమెంటులోనూ ఏపీ తీరును ఎండగడతామని వెల్లడి
దశాబ్దాలుగా తెలంగాణకు జరుగుతున్న సాగునీటి వివక్ష అంశంపై లోతుగా చర్చించారు. స్వయం పాలనలో సాగునీటి కష్టాలను ఎట్టి పరిస్థితిల్లోనూ రానివ్వకూడదని సీఎం కేసీఆర్ అన్నారు...
Hyderabad, July 7: కృష్ణా నదీ జలాల వినియోగంలో, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వైఖరి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసేలా ఉన్నాయని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తాము అన్ని వేదికల మీద రాజీ లేకుండా పోరాడుతామని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. నదీ జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాను రాబట్టుకోవడంతో సహా, తెలంగాణ లిఫ్టులను నడిపించుకునేందుకు జలవిద్యుత్ ఉత్పత్తిని కొనసాగించాలని రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్స్, న్యాయస్థానాలు సహా రాబోయే పార్లమెంటు సమావేశాల్లోనూ తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను నిర్ధారించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు సందార్భాల్లో కేంద్రంపై ఒత్తిడిచేస్తూ వస్తుంది. అలాగే కృష్ణా ట్రిబ్యునల్, కెఆర్ఎంబీ తదితర వేదికల మీద తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది.
నదీ జలాల్లో రాష్ట్ర సాగునీటి వాటాను హక్కుగా పొందడానికి, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయటానికి సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దశాబ్దాలుగా తెలంగాణకు జరుగుతున్న సాగునీటి వివక్ష అంశంపై లోతుగా చర్చించారు. స్వయం పాలనలో సాగునీటి కష్టాలను ఎట్టి పరిస్థితిల్లోనూ రానివ్వకూడదని సీఎం కేసీఆర్ అన్నారు. దాదాపు ఆరు గంటలకు పైగా జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్రం తరఫున ఎటువంటి వ్యూహాన్ని ఎత్తుగడలను అనుసరించాలనే విషయాలకు సంబంధించి సమావేశంలో చర్చించిన సీఎం అధికారులకు ఆ దిశగా మార్గనిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, ఈఎన్సీ మురళీధర్ రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, అడ్వకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
(The above story first appeared on LatestLY on Jul 07, 2021 08:03 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

