Hyderabad, April 15: మండే వేసవి ఏప్రిల్ నెలలో కూడా హైదరాబాద్ నగరంలో ఉదయం చల్లటి అనుభూతిని కలిగిస్తుంది. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలతో కురుస్తున్న వర్షపాతంతో వాతావరణం చల్లబడింది. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు కూడా వీచాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సగటు కంటే 4-5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతున్నాయి.
ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
రాబోయే ఐదు రోజుల్లో అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మిగిలిన రోజులు కూడా రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుండి మితమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.
గత రాత్రి నిర్మల్ జిల్లాలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెంలో 81 మిమీ వర్షపాతం నమోదు అయింది. సంగారెడ్డిలోని పుల్కల్ లో 57 మిమీ వర్షపాతం నమోదైంది. ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా పలు చోట్ల గోడలు కూలగా, మరికొన్ని చోట్ల కోతకు వచ్చిన మామిడి పండ్లు నేలరాలాయి. వర్షంతో వాతావరణం చల్లబడి ఎండ వేడిమి నుంచి కొంత ఊరట లభించినా, కొన్ని చోట్ల నష్టం సంభవిస్తుంది.