Hyderabad, November 4: హైదరాబాద్ నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ (Abdullahpurmet) లో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్‌మెట్ లో తహసీల్దార్ (Tehsildar) గా విధులు నిర్వహిస్తున్న విజయా రెడ్డి (Vijaya Reddy)పై సోమవారం ఒక దుండగుడు ఆమె ఆఫీసులోకి చొరబడి నిప్పంటించాడు. దీంతో ఒళ్లంతా మంటలతో హాహాకారాలతో ఆ మహిళా ఉద్యోగి బయటకు పరుగులు తీసింది. తీవ్రగాయాలతో అక్కడికక్కడే విజయారెడ్డి మృతి చెందింది.
ఈ ఘటన అక్కడ భీతావహ వాతావరణాన్ని సృష్టించింది. తమ తోటి ఉద్యోగి సజీవ దహనం అవుతుండటం పట్ల ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు, తహసీల్దారును కాపాడే క్రమంలో ఆమె డ్రైవర్ మరియు అటెండర్లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఇందులో కూడా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఉద్యోగులంతా భోజన విరామం సమయంలో ఉండటం చూసి, నేరుగా తహసీల్దార్ ఛాంబర్ లోకి చొరబడి ఆమెను సజీవంగా దహనం చేయడం స్థానికంగా కలకలం రేపుతుంది. తమ ఆఫీసర్ మృతితో సిబ్బంది దిగ్బ్రాంతికి గురయ్యారు.
ఈ ఘటనకు కారకుడైన నిందితుడికి కూడా మంటలంటుకున్నట్లు తెలుస్తుంది. మంటలతోనే నిందితుడు పరుగులు తీసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిందితుడిని గౌరెల్లి ప్రాంతానికి చెందిన సురేశ్ గా అనుమానిస్తున్న పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. కాలిన గాయాలతో ఏదైనా ఆసుపత్రిలో చేరి ఉండవచ్చునని భావించి సమీపంలోని ఆసుపత్రి రికార్డులను తనిఖీ చేస్తున్నారు.
భూరిజిస్ట్రేషన్‌పై వివాదం? ఘటనాస్థలాన్ని పరిశీలించిన మంత్రి, ఉరిశిక్ష వేయాలని ఉద్యోగుల డిమాండ్
తాజా సమాచారం మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అతడికి చికిత్స చేయిస్తున్నట్లు తెలుస్తుంది. ఔటర్ రింగు రోడ్డు పక్కన బాచారం గ్రామంలో 7 ఎకరాల భూవివాదం విషయంలోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్తున్నారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సేవచేసే ప్రభుత్వ ఉద్యోగులపై ఇలాంటి దాడులు జరగటాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. నిందితులెవరైనా కఠినంగా శిక్షిస్తామని మంత్రి స్పష్టంచేశారు.
మరోవైపు ఈ సమాచారం అందుకున్న రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు ఘటనాస్థలానికి చేరుకొని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకే భద్రత లేకుంటే ఇక ప్రజల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. పట్టపగలు ప్రభుత్వ కార్యాలయంలో ఓ మహిళా ఎమ్మార్వోను సజీవదహనం చేయడం అత్యంత పాశవికమైన, హేయమైన చర్యగా వారు అభివర్ణించారు. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.