Hyderabad, Dec 4: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) కాంగ్రెస్ (Congress) విజయం సాధించింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ (BRS) రెండో స్థానానికి పరిమితమైంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓటమి తప్పదని తెలిసిన వెంటనే హుందాగా వ్యవహరిస్తూ సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పార్టీల గెలుపోటములు ఖరారైందని తెలిసిన వెంటనే కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. సీఎంవో ప్రధాన కార్యదర్శికి లేఖను అందించి గవర్నర్‌కు సమర్పించాల్సిందిగా కోరారు. ఆ తరువాత మధ్యాహ్నం మూడు గంటలకు ప్రగతిభవన్ నుంచి తన నియోజకవర్గానికి (గజ్వేల్) బయలుదేరారు.
ఏం జరిగింది?
సాయంత్రం 4 గంటల సమయంలో ప్రగతిభవన్ నుంచి బయటకొచ్చిన కేసీఆర్ దగ్గరికి సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చారు. అయితే, ఆయన్ని వద్దని కేసీఆర్ వారించారు. కాన్వాయ్ లేకుండా, ఎటువంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లు తీసుకోకుండా ఓ సామాన్య పౌరుడిగా ఆయన పయనమయ్యారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ వాహనంలో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి (ఫామ్ హౌస్) వెళ్లారు. వాహనంలో ముందు సీట్లో సంతోష్ కుమార్ వెనక సీట్లో కేసీఆర్ మాత్రమే ఉన్నారు. ఆయన వెనుక గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మరో వాహనంలో కేసీఆర్ ను అనుసరించారు. గన్ మెన్లను కూడా కేసీఆర్ వెంట రానీయలేదు.