Fish Prasadam (Credits: Twitter)

మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం బాధితుల కోసం బత్తిని కుటుంబీకులు అందించే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. దాదాపు 6 లక్షల మందికి ఈ చేప ప్రసాదం అందించనున్నారు. శని, ఆది, సోమవారాల్లో ఈ చేప మందు పంపిణీ జరగనుంది. శనివారం నుంచి ఆదివారం వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో, ఆ తర్వాత ఆదివారం నుంచి కవాడీగూడ, దూద్‌బౌలిలో ఈ చేప మందు పంపిణీ చేయనున్నట్లు బత్తిని కుటుంబీకులు వెల్లడించారు.

ముందుగా శనివారం ఉదయం 9 గంటల సమయంలో దూద్‌బౌలిలోని తమ నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ప్రత్యేక వాహనంలో నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌కు ఈ చేప మందును తరలించనున్నట్లు బత్తిని అమర్‌నాథ్‌ గౌడ్ వెల్లడించారు.

కాగా.. బత్తిని కుటుంబీకులు దాదాపు 180 ఏళ్లుగా ఆస్తమా బాధితుల కోసం ఈ చేప మందును అందిస్తూ వస్తున్నారు. ఏటా మృగశిర కార్తె రోజున ఈ చేపమందును పంపిణీ చేస్తారు. ఈ ఏడాది కూడా దాదాపు 6 లక్షల మందికి చేప మందును పంపిణీ చేసేందుకు బత్తిని కుటుంబం సిద్ధమైంది. ఇక ఈ మందు కోసం తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు రాజస్థాన్, యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది ఆస్తమా బాధితులు ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన షెడ్లలో ఉంటున్నారు.  రెండు రోజులకే బీహార్‌ని తలపిస్తున్నారు, టీడీపీ దాడులపై మండిపడిన పేర్ని నాని, గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లిన వైసీపీ నేతలు

అసలేంటీ చేప మందు ?

బత్తిని కుటుంబీకులు చెబుతున్న దాని ప్రకారం.. ఈ మందులో పాలపిండి, ఇంగువ, బెల్లం, పసుపు, ఇతర వనమూలికలు కలుపుతారు. కొరమేను చేప పిల్లలను ఈ చేపమందు పంపిణీకి వినియోగిస్తారు. పంపిణీ చేయడానికి కొద్ది గంటల ముందు మాత్రమే మందును తయారు చేస్తారు. బతికి ఉన్న కొరమేను చేప పిల్ల నోటిలో మందును ఉంచి దానిని ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు నీటి ద్వారా మింగిస్తారు. దాంతో గొంతు ద్వారా వెళ్లినప్పడు స్వరపేటికను కూడా శుద్ధి చేయడమే కాకుండా జీర్ణాశ్రయంలో మెల్లగా కరగడంతో వ్యాధి తగ్గిపోతుందని నమ్మకం.

చేప మందు చరిత్ర:

ఈ మందును మొదట 1847లో అందించేవారు. బత్తిని అమర్‌నాథ్ గౌడ్ చెబుతున్న దాని ప్రకారం.. అప్పట్లో ఓ సాధువు దేశ సంచారం చేస్తూ హైదరాబాద్​ పాతబస్తీకి వచ్చినప్పుడు అమర్‌నాథ్ గౌడ్ పూర్వీకులైన బత్తిని వీరన్నగౌడ్​ ఆయనకు ఆశ్రయం కల్పించారు. ఆ సమయంలోనే చేప మందు గురించి ఆ సాధువు ద్వారా తెలుసుకున్నారు. అలాగే ఈ మందును ఉచితంగా పంపిణీ చేస్తే అన్ని విధాలా మంచి జరుగుతుందని సాధువు చెప్పడంతో.. అప్పటి నుంచి బత్తిని కుటుంబం అందరికీ ఈ చేప మందును ఉచితంగా పంపిణీ చేస్తూ వస్తోంది. అయితే మొదట్లో పాతబస్తీలో ఈ మందును పంపిణీ చేసేవారు. ఆ తర్వాత రద్దీ పెరగడంతో నాంపల్లి గ్రౌండ్‌కు మార్చారు.

ఈ దఫా ఏర్పాట్లెలా ఉన్నాయంటే:

చేపమందు పంపిణీ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా అందరికీ మందు లభించేలా వివిధ శాఖల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముందుగా ఎగ్జిబిషన్ మైదానం అజంతా ద్వారం నుంచి లోనికి అనుమతించనున్నారు. అక్కడ కౌంటర్ వద్ద టోకెన్ తీసుకుని క్యూలో నిలబడాల్సి ఉంటుంది. టోకెన్ పొందేందుకు దాదాపు 32 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది.

చేప మందు పంపిణీ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా దాదాపు 1200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు అబిడ్స్‌ ఏసీపీ ఆకుల చంద్రశేఖర్‌ తెలిపారు. గ్రౌండ్‌లో పోలీసు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయడమే కాకుండా.. సిటీ సెక్యూరిటీ వింగ్, డాగ్‌ స్క్వాడ్, బాంబ్‌ స్క్వాడ్‌ టీమ్‌లతో మొత్తం గ్రౌండ్‌ని క్షుణ్ణంగా తనిఖీ చేశామని, డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్లు, సీసీ టీవీలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

దీనికి తోడు మందు పంపిణీ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దాదాపు 300 మంది వాలంటీర్లు ఇక్కడ పనిచేయబోతున్నారు. అలాగే ఎవరైనా అనుకోకుండా అనారోగ్యానికి గురైతే హుటాహుటిన వైద్య సహకారం అందించేందుకుగానూ 6 వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడమే కాకుండా.. అవసరమైతే ఆసుపత్రులకు తరలించేందుకు 108 ఆంబులెన్సులను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.