Hyderabad, July 24: కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) తన సుదీర్ఘ ప్రసంగంలో కనీసం తెలంగాణ ఊసెత్తలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ పట్ల కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఇవాళ ఆసెంబ్లీలో (Telangana Assembly) తీర్మానం చేశారు. ‘కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం’ అనే అంశంపై పెట్టిన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తెలంగాణ ఒక రూపాయి పన్ను చెల్లిస్తే తెలంగాణకు కేంద్రం ఇచ్చేది 43 పైసలే.. బీహార్ కు (Bihar) రూ.7.26 పైసలు. తెలంగాణ నుంచి 3లక్షల కోట్లకుపైగా పన్నుల రూపంలో ఇస్తే.. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చేది 1 లక్షా 68వేల కోట్లు మాత్రమే. మన హక్కులు మనకు ఇవ్వకపోవడం వల్లే ఈ అంశంపై సభలో చర్చించాల్సిన పరిస్థితి.
ఐదు దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్నది ఎంత? దక్షిణాది రాష్ట్రాలు పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తున్నది రూ.22 లక్షల 26 వేల కోట్లు. కేంద్రం 5 రాష్ట్రాలకు తిరిగి ఇచ్చేది రూ.6 లక్షల 42వేల కోట్లు మాత్రమే. పన్నుల రూపంలో కేంద్రానికి ఉత్తరప్రదేశ్ ఇచ్చేది రూ.3 లక్షల 41 వేల కోట్లు మాత్రమే. కానీ యూపీకి కేంద్రం తిరిగి ఇచ్చేది రూ.6 లక్షల 91వేల కోట్లు. ఐదు రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల కంటే యూపీకి చెల్లించేది ఎక్కువ.. ఇదీ కేంద్రం వివక్ష. అంతేగాక రాష్ట్రంపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఈ నెల 27 జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని కూడా బహిష్కరించనున్నట్లు (Boycotting NITI Aayog Meeting) సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హక్కులకు భంగం కలిగించిందని, నిధుల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆయన మండిపడ్డారు. కాగా ఈ నెల 27న ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది.