Telangana Assembly(Video Grab)

Hyd, July 24:  రెండోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జాబ్ క్యాలెండ్‌పై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. నిరుద్యోగుల సమస్యలపై చర్చించాలని పట్టుబట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇక ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ప్రశ్నోత్తరాల సందర్భంగా పలువురు సభ్యులు ప్రశ్నలు అడగ్గా మంత్రులు సమాధానం ఇచ్చారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు మాజీ సీఎం కేసీఆర్. గోదావరి వరదల వల్ల జరిగిన పంట నష్టంపై చర్చించాలని బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు స్పీకర్.

ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు - హరీష్ రావు మధ్య మాటల యుద్ధం నెలకొంది. మంత్రి నాకు ప్రశ్నలు వేస్తున్నారు, నేను సమాధానం చెప్పమంటే చెబుతా అని హరీష్ రావు చెప్పగా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ సమాధానం చెప్పారు, మీకు ఇంకా వివరాలు కావాలంటే మరో రూపంలో రావలని ఇది క్వశ్చన్ అవర్ అని తెలిపారు శ్రీధర్ బాబు.

శ్రీధర్ బాబు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్‌ రావు. ఆనాడు మీకు నిరసన తెలిపే అవకాశం ఇచ్చాం,

మాకు నిరసన తెలిపే అవకాశం ఇవ్వండి అంటూ చురకలు అంటించారు. మా మేనిఫెస్టోను బట్టీ పట్టినందుకు హరీష్ రావుకు ధన్యవాదాలు తెలిపారు శ్రీధర్ బాబు. మా మేనిఫెస్టోను బట్టీ పట్టినందుకు మీకు పాస్ మార్కులు వేస్తున్నాను అని ఎద్దేవా చేయగా తాను సూటిగానే ప్రశ్నలు అడుగుతున్నానని బదులిచ్చారు హరీష్ రావు.

ఆర్టీసీ కార్మికులను ఎప్పటిలోగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. యూనియన్ పునరుద్ధరణ చేస్తామని హామీ ఇచ్చారు, చనిపోయిన కార్మికుల పిల్లలకు వెంటనే ఉద్యోగం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బకాయిలు రూ. 300 కోట్ల ఇస్తున్నట్లు చెక్ చూపించిన ఇప్పటివరకు ఆ చెక్కు బస్‌ భవన్‌కు రాలేదని చురకలు అంటించారు.

ఇక సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోడ్డు, కరెంటు లేకుండా తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారని విమర్శించారు. ప్రతీ తండా నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు వేస్తాం అని తెలిపారు. ప్రజలు శిక్షించినా బీఆర్ఎస్ నేతలు మారడం లేదని.... తండాల అభివృద్ధి జరిగినప్పుడే సంపూర్ణ అభివృద్ధి అని ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. కేటీఆర్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర అభివృద్ధికి పాటు పడాలని ఆకాంక్ష

ఇక రేపు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం. రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో కేబినెట్ సమావేశం జరగనుండగా బడ్జెట్‌కు అమోదం తెలపనుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.