Hyderabad, March 18: బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) తెలంగాణ మహిళా కమిషన్ (Telangana State Commission for Women) ఎదుట శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజయ్‌ను మహిళా కమిషన్ దాదాపు మూడు గంటల పాటు విచారించింది. కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మహిళా కమిషన్ ఆయనను గట్టిగా నిలదీసినట్లు సమాచారం. గతంలోనూ అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోలను సంజయ్‌కు కమిషన్ చూపించింది. తాను ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యానించలేదని బండి సంజయ్ కమిషన్ ఎదుట సంజాయిషీ ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది.
మరోసారి బండి సంజయ్‌ను కమిషన్ విచారించే అవకాశం ఉంది. మహిళలపై మరోసారి సామెతలు ప్రయోగించొద్దని సంజయ్‌ను కమిషన్ ఆదేశించింది. ఇలాగే అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఎవరైనా సరే మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానిస్తే కఠిన చర్యలు తప్పవని మహిళా కమిషన్ హెచ్చరించింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన సందర్భంలో బండి సంజయ్ స్పందిస్తూ ఆమెపై అనుచిత వ్యాఖయలు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. సొంతపార్టీ నుంచి బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.