Hyderabad, Nov 1: తెలంగాణలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద శ్రీనివాస్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నంకు పాల్పడటం కలకలం రేపింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఇటీవల అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ అతను ఆత్మహత్యాయత్నానికి (BJP Worker Suicide Attempt) పాల్పడ్డాడు. బీజేపీ పార్టీ ఆఫీసు (BJP Office) ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే సమీపంలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుడి స్వస్థలం రంగారెడ్డి జిల్లా యాచారం (మ) తమ్మలోనిగూడెం అని సమాచారంను బట్టి తెలుస్తోంది.
బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన రావుల శ్రీధర్‌రెడ్డి: ఇదిలా ఉంటే బీజేపీకి సీనియర్ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి రావుల శ్రీధర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఆదివారం ఉదయం రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి పంపించారు. అలాగే కార్యకర్తలు, అనుచరులతో కలిసి నేడు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. 2018 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీచేసిన శ్రీధర్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూశారు. బీజేపీ కీలకంగా భావించే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముందు శ్రీధర్‌రెడ్డి రాజీనామా చేయడం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా నేతలు భావిస్తున్నారు.
దీనిపై శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో 11 ఏళ్ల కిందట కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరాను. జూబ్లీహిల్స్ నుంచి 2018లో పోటీ చేశాను. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేశాను. బీజేపీ అనుసరిస్తున్న తీరు వల్ల తెలంగాణకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. కేంద్రం రైతు వ్యతిరేక విధానాలు పూర్తి అబద్ధాలు చెప్పడం నచ్చడం లేదు. కేసీఆర్ ద్వారా తెలంగాణ సాధ్యమైంది. 6 ఏళ్లుగా పురోగమిస్తుంది. దేశంలో తెలంగాణ అగ్రగామిగా కేసీఆర్ నిలబెట్టారు. ఈ మధ్య కేంద్ర విధానాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయి. తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్.. ఆధ్వర్యంలో తెలంగాణ భద్రంగా ఉంది. కేసీఆర్ నేతృత్వంలో పనిచేయాలని నిర్ణయించాను.’అని అన్నారు